ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. నేడు సుప్రీం కోర్టులో విచారణ..!

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. నేడు సుప్రీం కోర్టులో విచారణ..!

తెలంగాణ (Telangana) రాజకీయ వాతావరణాన్ని కలకలం రేపిన ఎమ్మెల్యేల ఫిరాయింపు (MLAs Defection) వ్యవహారం నేడు సుప్రీం కోర్టు (Supreme Court of India) ముందుకు రానుంది. ఢిల్లీ (Delhi)లోని సుప్రీం కోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక కేసుపై విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Telangana Assembly Speaker) కొట్టివేయడంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ స్పీకర్ తీర్పు వెలువరించారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో విషయం సుప్రీం కోర్టు వరకు చేరింది.

గత విచారణలో స్పీకర్‌కు నాలుగు వారాల గడువు విధిస్తూ, కోర్టు ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కేనా? లేక న్యాయస్థానానిదేనా? అన్న కీలక ప్రశ్నలను కూడా ధర్మాసనం లేవనెత్తింది.

ఈ కేసులో మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి కోర్టులో హాజరై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని ఇప్పటికే తెలియజేశారు. నేటి విచారణలో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment