డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Dr. B. R. Ambedkar Konaseema District) గ్యాస్ లీకేజీ (Gas Leakage)తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ (ONGC) డ్రిల్ సైట్ (Drill Site) నుంచి భారీగా గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. సుమారు రెండు గంటలకుపైగా గ్యాస్ పైకి చిమ్ముతుండగా, కొద్దిసేపటికే మంటలు అంటుకొని 100 అడుగులకుపైగా అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి. ఘటనాస్థలిలో భీకర శబ్దాలు వినిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మొదటగా తెల్లటి గ్యాస్ మేఘాలు గ్రామమంతా వ్యాపించాయి. అవి కొబ్బరి తోటలు, పంట పొలాలపై విస్తరించడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అనంతరం గ్యాస్‌కు మంటలు అంటుకోవడంతో ఆకాశాన్ని తాకేలా అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి. మంటల ధాటికి ఇప్పటివరకు సుమారు 500 కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఆక్వా చెరువులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్‌జీసీ సిబ్బంది, ఫైర్ సర్వీస్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ఇరుసుమండ గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యలుగా గ్రామవాసులకు మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేసి ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.
భద్రత దృష్ట్యా చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను కూడా ఖాళీ చేయిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలను లక్కవరం కళ్యాణ మండపానికి తరలిస్తున్నారు. ఘటనాస్థలిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎంపీ పరిస్థితిని నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 24 గంటలు ధాటితే కానీ, ఏమీ చెప్పలేమన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. కోనసీమలో జరిగిన ఈ ఘటనతో ప్రాంతమంతా ఉద్విగ్న పరిస్థితి నెలకొంది.







