ఖలీదా జియా: వితంతువు నుంచి దేశ ప్రధాని వరకు

ఖలీదా జియా: వితంతువు నుంచి దేశ ప్రధాని వరకు

బంగ్లాదేశ్ (Bangladesh) తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా (Khaleda Zia) (80) మంగళవారం మృతి చెందారు. ఒకప్పుడు “బాధ్యత గల గృహిణి” (Responsible Homemaker)గా గుర్తింపుపొందిన ఆమె, భర్త హత్య తర్వాత దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా ఎదిగారు. ఖలీదా జియా భర్త జియౌర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేత. అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న ఖలీదా జియా.. భ‌ర్త మ‌ర‌ణం త‌రువాత నాయ‌కురాలిగా ఎదిగి, దేశానికి ప్ర‌ధాని స్థాయికి ఎదిగారు. ఖ‌లీదా జియా గురించి తెలుసుకుందాం..

నాయకురాలుగా జియా ఎదుగుదల
1945లో అప్పటి బ్రిటిష్ ఇండియా (British India)లోని దినాజ్‌పూర్‌ (Dinajpur)లో జన్మించిన ఖలీదా జియా, 15 ఏళ్ల వయసులో యువ సైనికాధికారి జియౌర్ రెహ్మాన్‌ను వివాహం చేసుకున్నారు. 1971లో పశ్చిమ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఆయన పాల్గొని, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. 1977లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జియౌర్ రెహ్మాన్ రాజకీయ పార్టీలకు, స్వేచ్ఛాయుత మీడియాకు తిరిగి అనుమతులు ఇచ్చారు. అయితే ఆయన పాలన కాలం సైనిక కుట్రలు, వాటి తర్వాత జరిగిన సామూహిక ఉరి శిక్షల కారణంగా వివాదాస్పదంగా నిలిచింది.

1981లో చిట్టగాంగ్‌లో జరిగిన సైనికాధికారుల తిరుగుబాటులో జియౌర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారు. అప్పటికి ఖలీదా జియా వయసు కేవలం 36 ఏళ్లు. భర్త మృతి వరకు ఇంటికే పరిమితమైన ఆమె, ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.

సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం
1982లో భర్త స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)లో సభ్యురాలిగా చేరిన ఖలీదా జియా, క్రమంగా ఉపాధ్యక్షురాలిగా ఎదిగారు. అదే సంవత్సరం బంగ్లాదేశ్‌లో సైనిక పాలన మొదలవ్వడంతో, ఆమె ఆ పాలనకు వ్యతిరేకంగా తీవ్ర ఉద్యమం చేపట్టారు. సైన్యం నిర్వహించిన నియంత్రిత ఎన్నికలను బహిష్కరించడంతో పాటు, ప్రజాస్వామ్యం (Democracy) కోసం పోరాడిన ఖలీదా జియా పలుమార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు. అయినా వెనక్కి తగ్గని ఆమె, ప్రజల నుంచి శక్తివంత‌మైన నాయకురాలుగా పేరు సంపాదించారు.

తొలి మహిళా ప్రధాని
1990లో సైనిక ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో BNP అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. ఆమె బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని మాత్రమే కాకుండా, ముస్లిం దేశాన్ని ఎన్నికల ద్వారా పాలించిన రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె ప్రధాని కావడంతో దేశం మళ్లీ పార్లమెంటరీ పాలన వైపు మళ్లింది. ఆమె తొలి పాలనలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి – ప్రాథమిక విద్యను ఉచితంగా, తప్పనిసరిగా అమలు చేయడం.

హసీనాతో రాజకీయ పోరాటం
1996 ఎన్నికల్లో ఖలీదా జియా, షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ (Awami League) చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2001లో ఇస్లామిక్ పార్టీలతో కూటమి కట్టి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఈ కూటమి ద్వారా పార్లమెంట్‌లో రెండు వంతుల మెజారిటీ సాధించినప్పటికీ, ఇస్లామిక్ పార్టీలతో సన్నిహిత సంబంధాలపై ఆమె ప్రభుత్వానికి విమర్శలు ఎదురయ్యాయి. రెండో విడ‌త‌ పాలనలో మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఖలీదా జియా, మహిళా ఎంపీలకు కోటా ప్రవేశపెట్టారు. యువతులకు విద్యను ప్రోత్సహించారు. అప్పటికి దేశంలో 70 శాతం మహిళలు నిరక్షరాస్యులే.

జైలు జీవితం, ఆరోగ్య సమస్యలు
2006లో ఆమె పదవీ కాలం ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో సైన్యం మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలను నిషేధించి, అవినీతి వ్యతిరేక దాడులు చేపట్టింది. ఈ కేసుల్లో ఖలీదా జియాతో పాటు ఆమె ప్రత్యర్థి షేక్ హసీనా కూడా అరెస్టయ్యారు. 2014 ఎన్నికలను బహిష్కరించడంతో BNP పార్లమెంట్‌లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 2018లో అనాథాశ్రమ నిధుల నుంచి సుమారు 2.52 లక్షల డాలర్లు దుర్వినియోగం చేశారన్న కేసులో ఖలీదా జియాకు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఆ కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆమె ఆరోపించారు. ఆర్థరైటిస్, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను 2019లో ఆసుపత్రికి, ఆ తర్వాత మానవతా కారణాలతో గృహ నిర్బంధానికి తరలించారు.

2024 తర్వాత మారిన పరిస్థితులు
2024లో షేక్ హసీనా ప్రభుత్వం ప్రజా ఉద్యమంలో కూలిపోవడంతో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. హసీనా భారత్‌లో త‌ల‌దాచుకోగా, తాత్కాలిక ప్రభుత్వం ఖలీదా జియాను విడుదల చేసి, ఆమె బ్యాంక్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను తొలగించింది. కాలేయ సిరోసిస్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఖలీదా జియాకు పలు కేసుల్లో విముక్తి లభించింది. చికిత్స కోసం 2025 జనవరిలో లండన్ వెళ్లేందుకు అనుమతి లభించింది.

దీర్ఘకాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతూ, 2025 డిసెంబర్ 30 తెల్లవారుజామున ఢాకాలో ఖలీదా జియా తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అరఫాత్ రెహ్మాన్ 2015లో మృతి చెందగా, పెద్ద కుమారుడు తారిక్ రెహ్మాన్ లండన్ ప్రవాస జీవితం ముగించుకుని ఇటీవలే బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చారు. ఆయనే బంగ్లాదేశ్ భవిష్యత్ నాయకుడిగా భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment