పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణాన్నిపోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) బృందం పరిశీలించింది. పీపీఏ సీఈఓ యోగేష్ పైతాన్కర్ (Yogesh Paitankar) నేతృత్వంలోని బృందం బుధవారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, జరుగుతున్న పనులను సమగ్రంగా పరిశీలించింది.
ఈ బృందంలో పీపీఏ సీఈఓ యోగేష్ పైతాన్కర్‌తో పాటు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్) సి.వి. సుబ్బయ్య, ఎం. రమేష్ కుమార్ (పీ అండ్ డి), డైరెక్టర్ కె. శంకర్ తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏఎన్వీ సతీష్ బాబు పీపీఏ బృందానికి ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని వివరించారు.
ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్‌కు చేరుకున్న పీపీఏ బృందం మధ్యాహ్నం 2.30 గంటల వరకు వివిధ నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించింది. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత యోగేష్ పైతాన్కర్ చేసిన తొలి పర్యటన కావడంతో, స్పిల్‌వే, డయాఫ్రమ్ వాల్, గ్యాప్–1, గ్యాప్–2, ఎగువ–దిగువ కాఫర్ డ్యామ్‌లతో పాటు జలవిద్యుత్ కేంద్రం పనులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. నిర్మాణాల పురోగతి, నాణ్యత, గడువులపై అధికారులతో వివరంగా చర్చించి తనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఎంఈఐఎల్ నిర్మిస్తున్న పోలవరం జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా పీపీఏ బృందం సందర్శించింది. జలవిద్యుత్ కేంద్రం పనుల పురోగతిని ఎంఈఐఎల్ సీఓఓ సతీష్ బాబు బృందానికి వివరించారు. ఈ సందర్భంగా క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ కె. శేషుబాబు, ఎస్‌ఈ కె. రామచంద్రరావు, క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ తిరుమలరావు, ఈఈ కె. బాలకృష్ణ, జీఎం ఏ. గంగాధర్, డీజీఎం మురళి పమ్మి, క్వాలిటీ కంట్రోల్ ఈఈలు నరసింహారావు, ప్రేంచంద్, డీఈలు నిర్మల, శ్రీకాంత్, విజయకుమార్, క్వాలిటీ కంట్రోల్ డీఈ శివప్రసాద్ తదితరులు పాల్గొని పనుల వివరాలను వెల్లడించారు.
ప్రతి నిర్మాణ పనిని పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువులపై జలవనరుల శాఖ, ఎంఈఐఎల్ ప్రతినిధులు (MEIL Representatives) పీపీఏ బృందానికి అవగాహన కల్పించారు. కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. 2027లో గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.
ఈ సందర్భంగా పీపీఏ సీఈఓ యోగేష్ పైతాన్కర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఎలాంటి జాప్యం లేకుండా, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.








