సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ (Senior IPS Officer Sunil Kumar) చేసిన సంచలన సోషల్ మీడియా పోస్ట్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుకు (Raghurama Krishnam Raju) సంబంధించిన చీటింగ్ కేసు (Cheating Case) ఎఫ్‌ఐఆర్‌ను (FIR) ఆయన బహిర్గతం చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలో వరుస పోస్టులతో రఘురామకృష్ణ రాజుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సునీల్ కుమార్, తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.
తన పోస్టులో సునీల్ కుమార్, “420 రఘురామకృష్ణ రాజు త్వరలో అరెస్ట్ కాబోతున్నారు. సీబీఐ(CBI) నమోదు చేసిన చీటింగ్ కేసులో రూ.945 కోట్ల మేర కాజేసిన గజ దొంగగా (Big Fraudster) ఆయనపై ఆరోపణలు ఉన్నాయి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కేసులో రఘురామకృష్ణ రాజు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయని, ఇది సీబీఐ నమోదు చేసిన అధికారిక కేసేనని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ కేసులో రఘురామకృష్ణ రాజు, ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసేందుకు సుప్రీంకోర్టు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సునీల్ కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే అది వ్యక్తిగతంగా రఘురామకృష్ణ రాజుకే కాకుండా, రాష్ట్రానికి మొత్తం తలవంపులుగా మారుతుందని సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల అమరావతి బ్రాండ్ దెబ్బతింటుందని, పెట్టుబడులు పెట్టే వారు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “ఇలాంటి గజదొంగను, చీటర్‌ను (Cheater) ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు?” అనే ప్రశ్న సహజంగానే వస్తుందని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్న సమయంలో, రఘురామకృష్ణరాజు అరెస్టు ఆ ప్రయత్నాలన్నింటినీ దెబ్బతీసే అవకాశముందని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు పూర్తై, కోర్టులో విచారణ ముగిసి రఘురామకృష్ణ రాజు నిర్దోషిగా తేలితే, అప్పుడే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవైనా, మరే పదవైనా ఇవ్వడంపై అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మాత్రం ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కీలక రాజ్యాంగ హోదాలో కొనసాగడం రాష్ట్ర ప్రతిష్ఠకు హానికరమని సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఈ పోస్టుతో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చ కొనసాగుతోంది. రఘురామకృష్ణ రాజు వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








