ఐటీ కంపెనీ ముసుగులో రియల్ ఎస్టేట్ కంపెనీకి విశాఖ భూములు – అమ‌ర్నాథ్ ఫైర్‌

ఐటీ కంపెనీ ముసుగులో రియల్ ఎస్టేట్ కంపెనీకి విశాఖ భూములు - అమ‌ర్నాథ్ ఫైర్‌

కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా మేలు జరగలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలపై కేసులు, రాష్ట్రానికి అప్పులు, తండ్రీ–కొడుకుల గొప్పలు తప్ప ప్రజలకు దక్కిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. విశాఖలో మాజీ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను పెద్ద కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులను ప్రోత్సహించడం సహజమే అయినా, ఐటీ కంపెనీ పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు విలువైన భూములను కట్టబెడుతున్నారని అన్నారు. అందులో సత్త్వ (SATTVA) సంస్థ ఒకటని చెప్పారు.

రిషికొండ (Rushikonda) ప్రాంతంలో మార్కెట్ విలువ ఎకరాకు రూ.40 కోట్ల వరకు ఉన్న భూమిని సత్త్వ కంపెనీకి మొత్తం 30 ఎకరాలు కేవలం రూ.45 కోట్లకే కేటాయించారని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ భూముల మొత్తం విలువ సుమారు రూ.1500 కోట్లు ఉంటుందని తెలిపారు. అంతేకాదు, భూమి కేటాయించిన 90 రోజుల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటివరకు సత్త్వ కంపెనీ చెల్లించలేదని చెప్పారు. డబ్బులు చెల్లించేందుకు గడువు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేయడం, వడ్డీ కూడా మాఫీ చేయడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

సత్త్వ ఐటీ కంపెనీ కాదు – రియల్ ఎస్టేట్ సంస్థే
సత్త్వ సంస్థ ఐటీ కంపెనీ కాదని, అది పూర్తిగా రియల్ ఎస్టేట్ సంస్థ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ సంస్థ ఉద్యోగాలు సృష్టించదని, అద్దెలకు భవనాలు ఇచ్చే సంస్థ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అయినా కూడా ఈ సంస్థ చేసే నిర్మాణాలకు ప్రభుత్వం 50 శాతం ఇన్సెంటివ్‌లు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉందని ప్రశ్నించారు. సత్త్వకు కేటాయించిన భూమిలో 50 శాతం వరకు గృహ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. “ఇంతకంటే దారుణం ఇంకెక్కడైనా ఉందా?” అంటూ ఆయన నిలదీశారు.

మరోపక్క రూ.2.66 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలకు ఒక్క రూపాయి కూడా పంచలేదని, మొత్తం డబ్బు తండ్రీ–కొడుకుల జేబుల్లోకే వెళ్లిందని గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సత్త్వ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవని, కానీ గత 18 నెలలుగా కూటమి నేతల భూ పంపకాలే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. ప్రజల ఆస్తులను దోచుకునే ఈ భూ పందేరాన్ని ఆపేందుకు వైసీపీ పోరాటం చేస్తుందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment