తెలంగాణ సచివాలయం (Telangana Secretariat)లో ప్రతిష్టించినట్టుగానే, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ (District Collectorate) ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలను (Telangana Thalli Statue) ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 33 జిల్లాల్లో విగ్రహాల ఏర్పాటు కోసం ఒక్కో జిల్లాకు రూ.17.50 లక్షల చొప్పున మొత్తం రూ.5.80 కోట్లు మంజూరు చేశారు. 12 అడుగుల ఎత్తుతో, 6 అడుగుల దిమ్మెపై నిలబెట్టే ఈ విగ్రహాలు మొత్తం 18 అడుగుల ఎత్తుతో ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించారు. సాంప్రదాయ పల్లెటూరి మహిళా రైతురాలి రూపంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించడంలో భాగంగా, ఆకుపచ్చ చీర, పసుపుపచ్చ అంచు, చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులు, నుదుటిపై ఎర్ర బొట్టు, మట్టి గాజులు, ముక్కుపుడక, కమ్మలు, గుండు పూసల హారం వంటి సంప్రదాయ ఆభరణాలతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
విగ్రహాల వర్చువల్ ఆవిష్కరణ
ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ రోజు తెలంగాణ తల్లి దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 27 కలెక్టరేట్లలో ప్రతిష్టించబడిన తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) వర్చువల్‌గా, రాష్ట్ర మంత్రులతో కలిసి ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రజా సమస్యల పరిష్కారార్థం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఈ విగ్రహాలు సాంస్కృతిక గౌరవాన్ని, తెలంగాణ అస్మితను ప్రతిబింబించే చిహ్నాలుగా నిలవనున్నాయి.








