రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దారితప్పిందని టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) వరదరాజులరెడ్డి (TDP MLA Varadarajula Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో జరిగిన తాజా ఘటనను ఉదహరిస్తూ, పోలీసుల ప్రవర్తన, పనిచేసే విధానం చూస్తుంటే బ్రిటీష్ పాలన (British Rule)లో ఉన్న పరిస్థితులే మేలు అనిపిస్తున్నాయని మండిపడ్డారు.
ఆర్ధిక లావాదేవీలు, డబ్బుల వసూలు విషయంలో పోలీసులు ఎంటరవ్వడం ఏంటని టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారి శ్రీనివాస్ (Gold Merchant Srinivas) తన భార్యతో కలిసి వెళ్లుతుండగా, పుట్టపర్తి సర్కిల్ ప్రాంతంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు కారు ఆపి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, అతని భార్య ప్రొద్దుటూరులోని పలుచోట్ల పోలీస్ స్టేషన్లు తిరిగినా, ఏ స్టేషన్‌లో ఉన్నారు, ఎందుకు తీసుకెళ్లారన్న వివరాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ తమ్ముడు వెంకటస్వామి (Srinivas’ Brother Venkataswamy) ఆర్థిక వివాదాన్ని కారణంగా చూపుతూ, పైఅధికారుల ఆదేశాలతో పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారని, ఇది పూర్తిగా సివిల్ వివాదం అయినప్పటికీ, పోలీసులు అక్రమంగా జోక్యం చేసి వ్యక్తిని ఎత్తుకెళ్లడం చట్ట విరుద్ధమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. 48 గంటలు పూర్తయినా కోర్టులో ప్రవేశపెట్టకపోవడం అత్యంత అనుమానస్పదమని అన్నారు.
ఈ వ్యవహారం కడప జిల్లా ఎస్పీకి కూడా తెలియకుండా, పైస్థాయి రాజకీయ లేదా అధికార ఆదేశాల మేరకు ఈ మొత్తం ఆపరేషన్ జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ఆయన నుంచి దాదాపు రూ.7 కోట్లు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని తాను ఉన్నతాధికారులు, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రంలో బ్రిటిష్ పాలనలో ఉన్న తీరే కనిపిస్తోందని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భయపెడుతున్నారు. చట్టాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.








