‘గిరిజ‌న ఆశ్ర‌మాల‌పై నిర్ల‌క్ష్యం.. కుళ్లిన కూరగాయలతో భోజనం’

గిరిజ‌న ఆశ్ర‌మాల‌పై నిర్ల‌క్ష్యం.. కుళ్లిన కూరగాయలతో భోజనం

ఏపీ (Andhra Pradesh)లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజ‌న (Tribal) ఆశ్ర‌మ పాఠశాల‌ల‌పై (Residential Schools) నిర్ల‌క్ష్యపు ధోర‌ణి కొన‌సాగుతోంది. మ‌న్యం జిల్లాలో తాగునీరు (Drinking water) క‌లుషితం కార‌ణంగా ఆరుగురు విద్యార్థులు ప‌చ్చ కామెర్ల వ్యాధితో ఇటీవ‌లే మృతిచెందినా, హాస్ట‌ళ్ల నిర్వ‌హ‌ణ తీరు ఇంకా మార‌క‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా సంద‌ర్శ‌న‌లో గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాల్లో వాస్త‌వ ప‌రిస్థితుల‌ను చూసి ఈవో సైతం విస్తుపోయారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజ‌న్ (Food Poisoning) కార‌ణంగా రెండ్రోజుల క్రితం దాదాపు 41 మంది పిల్ల‌లు ఆస్ప‌త్రిలో చేరారు. వారిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే, విద్యార్థుల అనారోగ్యానికి గ‌ల కార‌ణాలను అన్వేషిస్తూ ఐటీడీఏ పీఓ శ్రీ‌పూజ త‌నిఖీలు చేప‌ట్ట‌గా, ఘోర నిర్లక్ష్యం బయటపడింది.

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేసి భోజనం అందిస్తున్నారని ఐటీడీఏ పీఓ శ్రీపూజ స్వయంగా చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ పిల్లలకు ఈ కుళ్లిన కూరగాయలు ఇంట్లో వండుతారా?” అంటూ సిబ్బందిని నిలదీశారు. వంటశాల్లో నాసిరకం పదార్థాలు, పాడైన ఆహారం పెద్ద ఎత్తున కనిపించడంతో పీఓ విస్తుపోయారు.

ఇప్పటికే ఆహారం కారణంగా 41 మంది బాలికలకు అస్వస్థత కలగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పీహెచ్‌సీలో ఒకే బ‌డ్‌పై ముగ్గురు విద్యార్థినులకు చికిత్స అందించాల్సిన దుస్థితి ఉండటం అక్కడి వైద్య సదుపాయాల దయనీయ పరిస్థితిని బహిర్గతం చేస్తోంది.

పీఓ పరిశీలనలో ఆసుపత్రి ఆవరణం కూడా అధ్వాన్నంగా కనిపించింది. డ్రైనేజీ నీరు నిల్వ ఉండటం, దోమల బెడద ఎక్కువగా ఉండటం వంటి అంశాలపై పీఓ తీవ్ర ఆక్షేపణలు చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, గిరిజన విద్యార్థుల హాస్టళ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆశ్రమ పాఠశాలల నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యం, కనీస వసతుల లేమి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇటీవ‌ల ప‌చ్చ‌కామెర్ల‌తో ప‌లువురు విద్యార్థులు మృతిచెందినా ప‌రిస్థితి మార‌క‌పోవ‌డంపై గిరిజ‌నుల్లో ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం.. నాదా బాధ్యత..? నాకు జ్వ‌రం వ‌చ్చింది.. మ‌రి ఎవ‌రిది బాధ్య‌త..? నాదేనా అని ఇటీవ‌ల గిరిజ‌న సంక్షేమ శాఖ‌ మంత్రి సంధ్యారాణి సెలవిచ్చిన తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment