రాజస్థాన్ రాయల్స్ జట్టు పగ్గాలు తిరిగి సంగక్కర చేతికి!

రాజస్థాన్ రాయల్స్ జట్టు పగ్గాలు తిరిగి సంగక్కర చేతికి!

ఐపీఎల్ (IPL) తొలి ఛాంపియన్స్‌గా చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు 2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరను తిరిగి తమ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమించినట్లు తాజాగా ప్రకటించింది. 2021 నుంచి 2024 వరకు రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేసిన సంగక్కర, గత 2025 సీజన్‌లో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ పదవిలో కొనసాగారు. ఇప్పుడు, 2026 సీజన్‌లో జట్టుకు రెండో ఐపీఎల్ టైటిల్‌ను అందించే బాధ్యతను ఆయనకు తిరిగి అప్పగించారు.

జట్టు కోచింగ్ సిబ్బందిలో కూడా ఫ్రాంచైజీ కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. విక్రమ్ రాథోర్ లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా తిరిగి జట్టులోకి రాగా, ట్రెవర్ పెన్నీ అసిస్టెంట్ కోచ్‌గా, సిద్ లాహిరి పెర్ఫార్మెన్స్ కోచ్‌గా తమ పాత్రలను తిరిగి చేపట్టనున్నారు. న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నారు.

ఇకపోతే, ఐపీఎల్ 2025 సీజన్ రాజస్థాన్ రాయల్స్‌కు అంతగా కలిసి రాలేదు. మెగా వేలం కారణంగా ఫ్రాంచైజీ జోస్ బట్లర్, అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ వంటి కీలక ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. దీనితో జట్టు సగం బలాన్ని కోల్పోయి, స్టాండింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2022 మరియు 2024 సీజన్లలో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన ఈ జట్టు, 2026 సీజన్‌లో మెరుగైన కం బ్యాక్ ఇవ్వాలని, సంగక్కర నాయకత్వంలో మళ్లీ విజయాల బాట పట్టాలని ఆశిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment