రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Medical Colleges)ల ప్రైవేటీకరణ (Privatization) నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ (YSRCP) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి (Tadipatri)లో వైసీపీ నేతల ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ (Privatization)ను నిరసిస్తూ ర్యాలీకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy)ని పోలీసులు అడ్డుకున్నారు.
తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి (JC Asmith Reddy) కార్యక్రమం కారణంగా వైసీపీ ర్యాలీని యాడికి మండలానికి పెద్దారెడ్డి మార్చుకున్నారు. అక్కడ కూడా ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకోవడంతో పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “అనుమతి ఇచ్చి తర్వాత మళ్లీ అడ్డుకోవడమేంటీ?” అంటూ ప్రశ్నించారు. పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ “ప్రాణహాని ఉందని వెళ్లకూడదంటున్నారు కానీ ఎవరి వల్ల ప్రమాదమో చెప్పలేకపోతున్నారు. జేసీ, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గ్యాంగ్‌స్టర్లలా వ్యవహరిస్తున్నారు. ప్రతి రోజు వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా.. పోలీసులు మౌనంగా చూస్తున్నారు” అని ఆరోపించారు. వైసీపీ నేతలు మాత్రం ప్రజా ప్రయోజనాల కోసం ఆందోళన చేస్తున్నామని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు.








