తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత, ప్రముఖ కవి డాక్టర్ అందెశ్రీ అకాల మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరియు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గార్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని నేతలు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ‘జయ జయహే తెలంగాణ’ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేసుకున్నారు. “తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది” అంటూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం రూపకల్పన సమయంలో అందెశ్రీతో గడిపిన అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డాక్టర్ అందెశ్రీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, తన పాటలతో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’