టీడీపీలో “కోట్లకు సీట్లు”.. తాజాగా రూ.7 కోట్ల వ్య‌వ‌హారం (Video)

టీడీపీలో “కోట్లకు సీట్లు”.. తాజాగా రూ.7 కోట్ల వ్య‌వ‌హారం

అధికార తెలుగుదేశం పార్టీ  (Telugu Desam Party)లో ” కోట్లకు సీట్ల” వ్యవహారం రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్యే సీటు కోసం విజ‌య‌వాడ (Vijayawada) ఎంపీ కేశినేని చిన్నీ త‌న వ‌ద్ద నుంచి రూ.5 కోట్లు వ‌సూలు చేశాడ‌ని తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు (Kolikapudi Srinivasa Rao) ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్ట‌గా, తాజాగా, మ‌రో మ‌హిళ ఓ టీడీపీ నేత చేసిన మోసాన్ని వివ‌రిస్తూ మీడియా ముందు క‌న్నీరు పెట్టుకుంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కొలిక‌పూడి వ్యవహారం చల్లారకముందే మరో కొత్త వివాదం బయటకు రావడం రాజకీయంగా కలకలం సృష్టించింది.

తాజాగా ఓ టీడీపీ నేత, రైల్వేకోడూరు నియోజకవర్గం టికెట్ ఇప్పిస్తానని చెప్పి మ‌హిళా నేత సుధా మాధ‌వి (Sudha Madhavi) నుంచి రూ.7 కోట్లు తీసుకొని మోసం చేశాడన్న ఉదంతం బ‌య‌ట‌ప‌డింది. బాధిత మ‌హిళా నేత మీడియా ఎదుటకు వ‌చ్చి కన్నీటి పర్యంతమైంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. “మా ఆస్తులన్నీ అమ్మి వేమన సతీష్‌కు ఏడు కోట్లు ఇచ్చాం.

కానీ, ఇప్పుడు డబ్బు అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయాలి” అంటూ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను వేడుకుంది. క‌ర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్ర‌వీణ్ త‌న‌కు మామ అవుతాడ‌ని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ త‌మ‌నే బెదిరిస్తున్నాడ‌ని మ‌హిళా నేత క‌న్నీరు పెట్టుకుంది. కారులో ఎక్కించుకొని త‌మ‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేశార‌ని, జ‌డ శ్ర‌వ‌ణ్ చొర‌వ‌తో తాము బ‌య‌ట‌ప‌డ్డామ‌ని మీడియా ఎదుట చెప్పింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ టికెట్లను కోట్ల రూపాయలు తీసుకొని విక్రయిస్తున్నారా..? అని ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికే కొలికపూడి ఆరోపణలతో సతమతమవుతున్న నాయకత్వానికి ఈ కొత్త ఆరోపణలు మరింత ఇబ్బందిగా మారాయి.

సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇలా అవినీతి ఆరోపణలలో చిక్కుకోవడం, పార్టీ విలువలను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. “కోట్లకు సీట్లు” వ్యవహారం పెరుగుతున్న నేపథ్యంలో, టీడీపీలో అంతర్గత సంక్షోభం మరింత ముదురే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment