కర్నూలు (Kurnool) జిల్లాలో వేమూరి కావేరి (Vemuri Kaveri) ట్రావెల్స్ (Travels) బస్సు(Bus) ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలైన విషాదానికి సంబంధించి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్‌కుమార్ (Vinod Kumar)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య (Miriyala Lakshmayya)ను A1 నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు యజమానిని A2 నిందితుడిగా చేర్చడంతో కేసు దర్యాప్తు దిశ మారింది.
ఈ ఘటనపై ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని, సాంకేతిక లోపాలు ఉన్న బస్సును రోడ్డుపైకి దించారని ఆరోపణలు ఉన్నాయి. విచారణలో ట్రావెల్స్ యజమాని బాధ్యత తప్పదని పోలీసులు భావించి వినోద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రూ.10 వేల పూచీకత్తుపై విడుదల
అరెస్ట్ చేసిన అనంతరం కర్నూలు స్పెషల్ మొబైల్ కోర్టులో వినోద్‌కుమార్‌ను హాజరుపరిచిన పోలీసులు, కేసు వివరాలను సమర్పించారు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ రూ.10 వేల సొంత పూచీకత్తుపై వేమూరి ట్రావెల్స్ యజమానిని విడుదల చేశారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.








