మహిళల వన్డే ప్రపంచకప్ (Women’s ODI World Cup) 2025లో శ్రీలంక (Sri Lanka) సాధించిన విజయం, టోర్నమెంట్‌లో నాలుగో సెమీఫైనల్ స్థానం కోసం పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. బంగ్లాదేశ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక తమ ఆశలను సజీవంగా ఉంచుకోగా, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు చివరి స్థానం కోసం రేసులో ఉన్నాయి. లీగ్ దశలో కేవలం ఏడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండడంతో, నాలుగో స్థానంపై త్వరలోనే స్పష్టత రానుంది.
వరుసగా మూడు ఓటములతో భారత్(India) సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో, 0.526 నెట్ రన్ రేట్‌తో భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో (న్యూజిలాండ్‌తో, బంగ్లాదేశ్‌తో) గెలిస్తే సెమీస్‌కు చేరుకోవడం సులభం అవుతుంది. అయితే, గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ హర్మన్‌ప్రీత్ సేనకు ‘చావో-రేవో’ లాంటిది. న్యూజిలాండ్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో (-0.245 రన్ రేట్‌తో) ఐదో స్థానంలో ఉంది. అందుకే భారత్‌తో జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. కివీస్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తే ఎనిమిది పాయింట్లతో సెమీస్‌కు చేరుకుంటుంది.
ఒకవేళ భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే, సెమీస్ చేరడానికి క్లిష్టమైన సమీకరణాలు అవసరం అవుతాయి. అప్పుడు ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ తప్పక ఓడిపోవాలి, ఆపై భారత్ తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారీ తేడాతో ఓడించాలి. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయినా, భారత్‌కు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దయి, శ్రీలంక లేదా పాకిస్తాన్ ఆరు పాయింట్లు సాధించకపోతే, భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించడం ద్వారా నెట్ రన్ రేట్ ఆధారంగా నాలుగో స్థానాన్ని దక్కించుకోవచ్చు. శ్రీలంక, పాకిస్తాన్‌లకు కూడా సెమీస్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ, అవి కాస్త కష్టతరం అని చెప్పాలి. నాలుగో స్థానం కోసం పోటీ చివరి లీగ్ మ్యాచ్‌ల వరకు ఉత్కంఠభరితంగా కొనసాగే అవకాశం ఉంది.







