నంద్యాల జిల్లా (Nandyal District) శ్రీశైలం (Srisailam)లో జరిగిన ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటనలో భద్రతా వ్యవస్థల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. భద్రతా వ్యవస్థ పర్యవేక్షణ, సమన్వయలోపం కారణంగా ఇద్దరు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డు (Fake Aadhaar Card)లతో వీఐపీ పాస్‌లు (VIP Passes) పొందినట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, బీజేపీ (BJP) అంతర్గతంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ పెద్దలు రహస్య దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిసింది.
సమాచారం ప్రకారం, శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు విశ్వరూపాచారికి ప్రధానమంత్రిని కలిసేందుకు అధికారిక వీఐపీ పాస్ మంజూరు చేయబడింది. అయితే, ఆయన స్థానంలో చిక్కుడు చెట్టు వెంకటేశ్వర్లు (Venkateswarlu) అనే వ్యక్తి ఆ పాస్‌ను వినియోగించుకున్నాడు. ఇదే విధంగా, మరో బీజేపీ సీనియర్ నేత తూము శివారెడ్డి (Thumu Shiva Reddy) స్థానంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు (Abhiruchi Madhu) డ్రైవర్ బాలును పాస్‌తో అనుమతించినట్లు సమాచారం.
ఈ ఘటనతో నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రికి కేటాయించిన అత్యున్నత స్థాయి భద్రత అయిన ఎన్ఎస్‌జీ కవరేజీలో కూడా ఈ తరహా లోపాలు ఎలా చోటు చేసుకున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర భద్రతా సంస్థలు ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు సమాచారం.







