లోన్ యాప్ గ్యాంగ్ వేధింపులు మరో కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పెళ్లైన కేవలం 40 రోజుల్లోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. విశాఖలోని ఎంవీపీ కాలనీ మహారాణిపేట అంగటిదిబ్బ ప్రాంతానికి చెందిన నరేంద్ర (22) లోన్ యాప్ వేధింపులకు ప్రాణాలు కోల్పోయాడు.
రుణం తీసుకున్నా, చెల్లించినా వేధింపులు ఆగట్లేదు
నరేంద్ర ఒక లోన్ యాప్ ద్వారా రూ. 2000 రుణం తీసుకున్నాడు. సకాలంలో రుణం చెల్లించలేదని ఆ యాప్ నిర్వాహకులు అతడి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి, వాటిని అతడి భార్యకు, స్నేహితులకు, బంధువులకు పంపించారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. నరేంద్ర కుటుంబ సభ్యులు లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎం.ఆర్.పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు ప్రజలకు సూచనలు
లోన్ యాప్‌ల గురించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. రుణం కోసం ఆ యాప్‌లు ఇస్తున్న లింకులు క్లిక్ చేయకుండా, వాటిని ఇన్‌స్టాల్ చేయేటప్పుడు కాంటాక్ట్, అడ్రస్, లొకేషన్ల పర్మిషన్లు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా వేధింపులు ఎదురైతే, 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.








