టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన రికార్డు సాధించాడు. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి టెస్టులో రాహుల్ శతకం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా- విండీస్ (IND vs WI Tests) మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానంలో గురువారం తొలి టెస్టు మొదలైంది.టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి, తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్లు నష్టపోయి 448 పరుగులు చేసింది.
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (36) ఫర్వాలేదనిపించగా, రెండో రోజు ఆటలో కేఎల్ రాహుల్ శతకం సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 197 బంతులు ఎదుర్కొని 12 ఫోర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే.. వారికన్ బౌలింగ్‌లో జస్టిన్ గ్రీవ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది రాహుల్ కెరీర్లో పదకొండో టెస్టు సెంచరీ కావడం విశేషం.
టెస్టు హిస్టరీలో ఏకైక ఘనత
టెస్టు మ్యాచ్‌లో రాహుల్ ఇలా సరిగ్గా వంద పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కావడం ఇది రెండోసారి. గతంలో జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులోనూ సరిగ్గా 100 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్లో ఒక ఆటగాడు సరిగ్గా 100 పరుగులు చేసి రెండుసార్లు అవుట్ కావడం.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ అరుదైన రికార్డును కేఎల్ రాహుల్ నెలకొల్పాడు.
అదే విధంగా.. టెస్టు కెరీర్లో 100 పరుగుల వద్ద రెండుసార్లు అవుటైన ఏడో ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ నిలవడం గమనార్హం.
భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్
రాహుల్ (100)తో పాటు ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అజేయ సెంచరీ (104)తో రాణించారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం (100 బంతుల్లో 50) సాధించాడు.
రెండో రోజు ఆట ముగిసే సరికి 448 పరుగులు చేసిన టీమిండియా.. విండీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే ఇదే స్కోరు వద్ద (448/5) టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.








