మంచిర్యాల (Mancherial) జిల్లా, కవాల్ టైగర్ రిజర్వ్ (Kawal Tiger Reserve) పరిధిలోని అటవీ అధికారులపై (Forest Officials) గిరిజనులు (Tribals) దాడికి (Attack) పాల్పడ్డారు. కళ్లలో కారం చల్లి, కర్రలతో కొట్టడంతో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన ఇందన్‌పల్లి (Indanpalli) అటవీ రేంజ్ పరిధిలోని సోనాపూర్ తండా, పాలగోరీల ప్రాంతంలో జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన దాదాపు 35 మంది అటవీ భూమిని ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారు. ఈ గుడిసెలను తొలగించాలంటూ అటవీ శాఖ సిబ్బంది సూచించగా, వారు అధికారులపై దాడికి దిగారు.
ఈ దాడిలో అటవీ సెక్షన్ అధికారి రాజేందర్, బీట్ అధికారి సంతోష్ గాయపడ్డారు. వారిని చికిత్స కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై జన్నారం పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీ, వన్యప్రాణి చట్టాల కింద ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారు.
గత రెండు మూడు రోజులుగా అటవీ అధికారులు గ్రామ పెద్దల సహాయంతో అటవీ భూమిని ఆక్రమించవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నా, ఈ దాడి జరగడం గమనార్హం.








