విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలోని బుక్కవారివీధిలో గల వెల్డింగ్ షాపులో ఆగస్టు 7 సాయంత్రం జరిగిన భారీ పేలుడు కేసులో కొత్త అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, సముద్రం నుంచి మత్స్యకారులు తీసుకొచ్చిన ఒక వింత వస్తువు ఈ పేలుడుకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ వస్తువును తెరిచే క్రమంలో పేలుడు సంభవించి ఉంటుందని, దీనివల్ల వెల్డింగ్ షాపులో పేలుడు సంభవించినట్లుగా భావిస్తున్నారు.
మృతులను వెల్డింగ్ షాపు యజమాని చ. గణేష్, కార్మికులు శ్రీనివాస్, ముత్యాలుగా గుర్తించారు. గణేష్, శ్రీనివాస్ సంఘటన స్థలంలోనే మరణించగా, ముత్యాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు గుర్తించిన గాయపడినవారు కింగ్ జార్జ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సముద్రం నుంచి తీసుకొచ్చిన వింత వస్తువును మత్స్యకారులు వెల్డింగ్ షాపుకు ఇచ్చి, దాన్ని తెరవమని కోరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వస్తువు రసాయన లేదా పేలుడు పదార్థం కలిగి ఉండవచ్చని, దాన్ని వెల్డింగ్ సామగ్రితో తెరవడానికి ప్రయత్నించినప్పుడు పేలుడు జరిగి ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనను “హృదయవిదారకం”గా అభివర్ణిస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
ఫిషింగ్ హార్బర్ వద్ద వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.








