ఇటీవల దేశ వ్యాప్తంగా భర్తలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హనీమూన్ (Honeymoon) హత్య కేసు (Murder Case) మొదలు దేశంలో ఏదో ఒక చోట భర్తలపై దాడుల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్ (Bihar) రాష్ట్రంలోని గయా జిల్లాలో భర్తలు తలపట్టుకునే ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఘర్షణకు దారి తీసి చివరకు రక్తపాతం జరగడం అందరిని షాక్‌కు గురిచేసింది.
ఖిజ్రాసరాయ్ (Khijrasarai) పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉన్న ఛోటే దాస్ అనే వ్యక్తి తన భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరిగింది, ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన భార్య, ఛోటే దాస్ మాట్లాడుతున్న సమయంలో ఆయన నాలుక (Tongue)ను కొరికేసి మింగేసింది.
ఛోటే దాస్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మగధ్ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధితుడు చాలా రక్తం కోల్పోయాడని, ఇప్పటికీ అతడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని పేర్కొన్నారు.
వింత విషయం ఏంటంటే, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే భార్యాభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వారు చెబుతున్నారు. అయితే గ్రామస్తులు ఈ దారుణ ఘటనను ధృవీకరించారు. విచిత్రంగా అనిపించినా, ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరి నుండి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు రాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.








