తనపై నమోదైన మద్యం కేసులను (Liquor Cases) పూర్తిగా రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణించారు వైసీపీ (YSRCP) లోక్ సభ (Lok Sabha) పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy). ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, సీజ్‌లు లేవని, నేరం నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాలు ఏవీ లేవని ఆయన స్పష్టంగా చెప్పారు. తన పాత్రపై ఆధారాలుంటే చూపించాలంటూ సవాల్ విసిరిన మిథున్ రెడ్డి (Mithun Reddy), “నా ఫోన్‌లు తీసుకోండి, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా” అంటూ సిట్ (SIT) అధికారులకు సూచించారు. భయపడే వ్యక్తి అయితే రాజకీయాల్లో ఉండనన్న ఆయన, ఈ కేసులను ధైర్యంగా ఎదుర్కొని బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కేసులో ముందే ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో కథలు అల్లారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న అధికారుల దగ్గర నుంచి నయానో భయానో స్టేట్మెంట్లు తీసుకున్నారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే, నోటి మాటల ఆధారంగా స్టేట్మెంట్లు రాసిపెట్టి తనపై కేసు నడుపుతున్నారని విమర్శించారు. ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని, ముందు ఎల్లో మీడియాలో “మాస్టర్ మైండ్” (Mastermind)గా ముద్ర వేసి, ఆ తర్వాత జైల్లో వేయాలనే కుట్ర కొనసాగుతోందని తెలిపారు.
ఇలాంటి రాజకీయం తనకు కొత్తకాదని చెప్పిన మిథున్, 2014–19 మధ్యకాలంలోనూ తప్పుడు కేసులు పెట్టారని గుర్తుచేశారు. అప్పట్లో కూడా తాను చేసిన తప్పేమీ లేదని చెప్పినా, వినకుండా జైలుకు పంపారని తెలిపారు. ఆ కేసులో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినవారే చివరికి కోర్టులో నిజం చెప్పారని, దాంతో కోర్టు ఆ కేసును కొట్టేసిందన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో తనపై అరెస్టు చేస్తున్నారని, రేపు అదే కోర్టులో ఈ కేసు కూడా కొట్టివేయబడతుందని ధీమా వ్యక్తం చేశారు.
మద్యం కేసు (Liquor Cases)లో మొదట 50 వేల కోట్లు అన్న తరువాత 30 వేల కోట్లు, చివరికి 3 వేల కోట్లుగా సంఖ్య మారిందని ఎద్దేవా చేశారు. ఎక్కడా డబ్బు సీజ్ చేయలేదని, పెట్టుబడులేమీ చూపించలేదని, కేవలం నోటి మాటలతో కథలు చెబుతున్నారని విమర్శించారు. ఒక ఎంపీగా తన పని పార్లమెంటు చట్టాలు, చర్చలకే పరిమితమని, మద్యం విధానాల్లో ఎక్కడా జోక్యం చేయలేదని స్పష్టం చేశారు. కక్షపూరితంగా తయారుచేసిన ఈ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని, తప్పు చేయని మనిషికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.