రెచ్చిపోతున్న రేష‌న్ మాఫియా.. విశాఖలో భారీగా ప‌ట్టుబ‌డిన పీడీఎస్ రైస్

రెచ్చిపోతున్న రేష‌న్ మాఫియా.. విశాఖలో భారీగా ప‌ట్టుబ‌డిన పీడీఎస్ రైస్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రేష‌న్ మాఫియా రెచ్చిపోతోంది. ఇంటింటికీ రేష‌న్ స‌రుకులు అందించే ఎండీయూ వెహికిల్స్‌ను ర‌ద్దు చేసిన‌ప్ప‌టికీ, పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) రైస్ పెద్ద‌ ఎత్తున ప‌ట్టుబ‌డ్డాయి. విశాఖ‌ త్రీ టౌన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లారీలు చండీగఢ్ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్నట్లు గుర్తించారు. స్థానిక అధికార పార్టీ నేతల సహకారంతో పీడీఎస్ రైస్ మాఫియా రెచ్చిపోతోందని స్థానికులు ఆరోపిస్తుండ‌గా, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.

పోలీసుల ఆకస్మిక తనిఖీలు
విశాఖపట్నం నగరంలో గత కొన్ని నెలలుగా పీడీఎస్ రైస్ అక్రమ రవాణా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. త్రీ టౌన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో మూడు లారీల్లో భారీ మొత్తంలో పీడీఎస్ రైస్‌ను గుర్తించారు. ఈ లారీల్లో రైస్‌ను అక్రమంగా రాష్ట్రం దాటిస్తున్న‌ట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న రైస్‌ను లెక్కిస్తున్న పోలీసులు, ఈ కేసులో ప్రధాన నిందితులను గుర్తించేందుకు విచారణను తీవ్రతరం చేశారు.

గతంలో కూడా 2024 డిసెంబర్‌లో విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్‌ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో ఎండీయూ వెహికిల్స్ ద్వారానే రేష‌న్ మాఫియా జ‌రుగుతుంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో వాటిని కూట‌మి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఇంటింటి పంపిణీ వాహ‌నాల‌ ర‌ద్దు త‌రువాతే బియ్యం అక్ర‌మ ర‌వాణా ఎక్కువైంద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం, సంబంధిత మంత్రి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment