కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో వ్య‌క్తి ఆత్మహత్య.. బీఆర్ఎస్ తీవ్ర ఆరోప‌ణ‌లు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో వ్య‌క్తి ఆత్మహత్య.. బీఆర్ఎస్ తీవ్ర ఆరోప‌ణ‌లు

Summarize with AI

తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాసంలో అనూహ్య సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌భుత్వ విప్ ఇంట్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే ఐలయ్య పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటూ, ఆయన ఇంట్లో భార్యతో కలిసి పనిచేస్తున్న రవి, మూడో అంతస్తులోని తన గదిలో శుక్రవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, సీబీసీఐడీ విచారణ జరపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మృతుడు రవి సొంత గ్రామం సైదాపురం. గత రెండు రోజులుగా అక్క‌డే ఉన్నాడని, అకస్మాత్తుగా ఎమ్మెల్యే నివాసంలో ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. “ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, సైదాపురంలోని తన ఇంట్లో ఎందుకు చేసుకోలేదు?” అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రవిని ఎమ్మెల్యే ఐలయ్య మందలించినట్లు సమాచారం ఉండగా, ఈ ఘటన వెనుక ఇతర కారణాలు ఉండవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రవి త‌న భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నాడని తెలుస్తోంది. రాత్రికి రాత్రి రవి మృతదేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఈ సందర్భంలో ఎమ్మెల్యే ఐలయ్య ఆసుపత్రిని సందర్శించారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత‌ కర్రె వెంకటయ్య తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. “రవి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? రాత్రికి రాత్రి మృతదేహాన్ని భువనగిరికి ఎందుకు తరలించారు?” అని ప్రశ్నించారు. ఈ మరణం వెనుక అనేక సందేహాలున్నాయని, సీబీసీఐడీ అధికారులతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికులు కూడా ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, నిష్పక్షపాత దర్యాప్తు కోరుతున్నారు. ఈ ఘటన రాజకీయ వివాదంగా మారే సూచనలు కనిపిస్తుండగా, దర్యాప్తు ఫలితాలపై రాష్ట్రవ్యాప్త దృష్టి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment