12 ఏళ్ల‌లో వీగిపోయిన‌ తొలిబిల్లు.. ఇండియా వ్యూహం ఫలిస్తుందా?

12 ఏళ్ల‌లో వీగిపోయిన‌ తొలిబిల్లు.. ఇండియా వ్యూహం ఫలిస్తుందా?

కేంద్రంలోని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం గత 12 ఏళ్ల పాలనలో ఎన్నడూ లేని విధంగా ఒక కీలక బిల్లు విషయంలో పార్లమెంటులో (Parliament) పరాజయాన్ని మూటగట్టుకుంది. మహిళా రిజర్వేషన్లు (Women Reservations), నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) (Delimitation) అంశాలతో ముడిపడి ఉన్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన 2/3 వంతు మెజారిటీ లభించకపోవడంతో లోక్‌సభలో (Lok Sabha) ఇది వీగిపోయింది. బీజేపీ(BJP) అధికారం చేప‌ట్టిన 12 ఏళ్ల కాలంలో వీగిపోయిన తొలిబిల్లు ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

వివాదానికి అసలు కారణం ఏమిటి?
ఈ బిల్లులో మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో లింక్ పెట్టడం ప్రధాన వివాదానికి దారితీసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్ల సంఖ్యను 543 నుండి 850కి పెంచాలని కేంద్రం భావించింది. దీనివల్ల జనాభా నియంత్రణ (Population Control) పాటించిన దక్షిణాది రాష్ట్రాలు (Southern States) తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని, ఉత్తరాది రాష్ట్రాల (Northern States) సీట్లు భారీగా పెరుగుతాయని విపక్షాలు ఆరోపించాయి.

2026-27 జనగణన జరుగుతున్న సమయంలో, పాత లెక్కలతో డీలిమిటేషన్ చేయడంపై ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లు వీగిపోయినప్పటికీ, దీన్ని ఒక రాజకీయ అవకాశంగా మార్చుకోవాలని ఎన్డీయే భావిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ (West Bengal), తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా వాడేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. “మేము మహిళలకు హక్కులు ఇవ్వాలనుకుంటే, టీఎంసీ (TMC), డీఎంకే (DMK) వంటి పార్టీలు అడ్డుకున్నాయి” అని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు.

ఈ విజయం ఇండియా కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో తాము విజయం సాధించామని, దక్షిణాది హక్కులను కాపాడామని వారు ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, సంఖ్యాబలం లేకపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరకు ఈ “మహిళా రిజర్వేషన్ – డీలిమిటేషన్” (Women Reservation–Delimitation) పోరు జ‌ర‌గ‌బోయే ఇరు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment