ఏపీ రాజకీయాల్లో వైసీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని వైసీపీ తన నాయకులు, కార్యకర్తలకు సూచించింది. రాజకీయంగా హుందాతనాన్ని ప్రదర్శించింది.
పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల దాదాపు 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామంపై రాజకీయంగా స్పందించేందుకు అవకాశం ఉన్నప్పటికీ వైసీపీ వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ ఆయన కుటుంబ జీవితాన్ని గౌరవించాలనే వైఖరి హుందాతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
పవన్ మూడో భార్య విడాకుల విషయంలో సంయమనం పాటించాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల కంటే ప్రజలకు సంబంధించిన అంశాలపైనే రాజకీయ పోరాటం సాగించాలనే ఆలోచన ఈ నిర్ణయంలో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబం గురించి, ఆయన తల్లి, చెల్లి విషయాలను రాజకీయ అజెండాగా మార్చుకుని నిత్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన నాయకులు వేదికలపై వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నప్పటికీ.. వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో హుందాతనాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.









