కూట‌మిలో ఇంకా తేల‌ని సీట్ల పంచాయితీ..

కూట‌మిలో ఇంకా తేల‌ని సీట్ల పంచాయితీ..

Summarize with AI

స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం అగ్నికి ఆజ్యం పోస్తోంది. మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేశారంటూ ఇప్పటికే జనసేన గుర్రుగా ఉండగా.. తాజాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పంపకాలపై జరుగుతున్న కుమ్ములాటలు కూటమిలో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయని సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామ‌ని మెజార్టీ సీట్ల వాటా కోసం జనసేన, బీజేపీ గట్టి పట్టుద‌ల‌గా ఉండ‌డంతో టీడీపీ త‌న రాజ‌కీయ వ్యూహాన్ని చాప‌కింద నీరులా చాక‌చ‌క్యంగా అమ‌లు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం స్థానాల్లో 25 శాతం స్థానాలను తమకు కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు వద్దే తేల్చిచెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా కీలకమైన కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ కార్పొరేషన్లతో పాటు సుమారు 25 మున్సిపల్ చైర్మన్ స్థానాలను తమకు ఇవ్వాలని జనసేన గట్టిగా పట్టుబడుతోంది.

మరోవైపు కమలదళం కూడా తమ బలాన్ని బట్టి 10 శాతం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు లేదా విశాఖ‌, రాజ‌మండ్రి కార్పొరేషన్లను తమకే కేటాయించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.

ఇరు పార్టీల నుంచి వస్తున్న భారీ డిమాండ్లతో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. క్షేత్రస్థాయిలో తమ కేడర్‌ను సర్దుబాటు చేసుకోవడం ఎలాగని టీడీపీ స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే వివాదాన్ని సద్దుమణిగింపు చేసేందుకు, చర్చలు జరిపేందుకు తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల పంపకాలు తేలకుండానే నామినేషన్ల గడువు మునుముందుకు వస్తుండటం, మరోవైపు భాగస్వామ్య పక్షాలు సింహభాగం సీట్ల కోసం పట్టుబడుతుండటంతో కూటమిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సీట్ల పంచాయితీ చివరికి ఏ రూపం దాల్చుతుందనేది ఉత్కంఠగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment