వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్రానికి వైసీపీ లేఖ‌

వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్రానికి వైసీపీ లేఖ‌

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పదేపదే భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఖరిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి పరామర్శకు వెళ్లిన సందర్భంగా కూడా వైఎస్ జగన్ భద్రతను గాలికి వదిలేశారని ఆరోపిస్తూ, వైసీపీ నేత‌, ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు.

జోగి రమేష్ పరామర్శ సమయంలో భద్రతా లోపాలు
ఇబ్రహీంపట్నం వెళ్లే సమయంలోనూ, తిరిగి వచ్చే సమయంలోనూ జగన్ కాన్వాయ్ భద్రత పూర్తిగా లోపించిందని వైసీపీ పేర్కొంది. కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగి రమేష్ నివాసానికి వెళ్లేందుకు, పోలీసులు జగన్ కాన్వాయ్‌ను ఏకంగా 47 కిలోమీటర్లు తిప్పారని ఆరోపించారు. అంతేకాకుండా, జగన్ భద్రతా సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వకుండా గ్రామాలు, ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్‌ను మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ కక్షతో ప్రతిపక్ష నేత భద్రతను నిర్లక్ష్యం చేయడం అత్యంత ప్రమాదకరమని, దీనివల్ల తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని వైసీపీ హెచ్చరిస్తోంది.

Z ప్లస్ కేటగిరీ ఉన్నా రక్షణ క‌రువు
వైఎస్ జగన్‌కు Z ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, కనీస ప్రమాణాలు పాటించకుండా చంద్ర‌బాబు ప్రభుత్వం వ్యవహరించిందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేత ప‌ర్య‌ట‌న‌ల‌కు ఇలాంటి భద్రతా లోపాలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో రాజ‌కీయ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారాయో సూచిస్తోందని, వైఎస్ జ‌గ‌న్‌కు కేటాయించిన వాహ‌నాలు కూడా డొల్ల‌త‌నంగా, మ‌ర‌మ్మ‌తుల‌కు గురైన వాటిని కేటాయించార‌ని వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి
ఈ వ్యవహారంపై వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, వైఎస్ జగన్‌కు పూర్తిస్థాయి Z ప్లస్ సెక్యూరిటీని కట్టుదిట్టంగా అమలు చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. చంద్రబాబు సర్కార్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఫిర్యాదు చేశారు. గతంలో వైఎస్ జగన్ పర్యటనల సమయంలో చోటుచేసుకున్న భద్రతా లోపాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తలశిల రఘురాం తెలిపారు. మొత్తంగా, వైఎస్ జగన్ భద్రత అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment