పంచాయతీ ఎన్నికలపై వైసీపీ లీగల్‌ నోటీసులు.. అధికారులకు కీలక హెచ్చరిక

పంచాయతీ ఎన్నికలపై వైసీపీ లీగల్‌ నోటీసులు.. అధికారులకు కీలక హెచ్చరిక

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ వైసీపీ లీగల్‌ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఎన్నికల అధికారులకు వైసీపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మహఫూజ్‌ ఎ. నజ్కీ నోటీసులు జారీ చేశారు. అక్టోబర్‌ 27, 2026న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు స్వేచ్ఛగా, నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్‌ 16న ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలను ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకూ వర్తింపజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని నోటీసుల్లో గుర్తుచేశారు. నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కలిగించిన ఘటనలపై ఫిర్యాదులను ఎన్నికల కమిషన్‌ పరిశీలించి, అవసరమైతే గడువును పొడిగించాలని పేర్కొన్నారు.

జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల వద్ద నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్న సందర్భాల్లో బాధిత అభ్యర్థులకు ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసే హక్కు ఉందని స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని పేర్కొన్నారు.

పల్నాడు, వైయస్సార్‌ కడప, తిరుపతి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులపై దాడులు, నిర్బంధాలు, నామినేషన్ల అడ్డగింత, బలవంతపు ఉపసంహరణలకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయని నోటీసుల్లో ప్రస్తావించారు. ఆయా ఘటనలపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసినట్లు గుర్తుచేశారు.

నామినేషన్‌ కేంద్రాలు, రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు, పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌ లేదా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని నోటీసుల్లో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ జరిగిన రోజే, అదే కేంద్రంలో ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతున్నందున నిరంతరాయంగా వీడియో రికార్డింగ్‌ చేయాలని కోరారు. పోలింగ్‌ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, బ్యాలెట్‌ పత్రాలు, ఎన్నికల రికార్డులను సీల్‌ చేసేంత వరకు రికార్డింగ్‌ కొనసాగాలని స్పష్టం చేశారు.

ఎన్నికల పిటిషన్ల దాఖలుకు నిర్దేశించిన గడువు ముగిసే వరకు వీడియో ఫుటేజీని భద్రపరచాలని, పిటిషన్లు దాఖలైతే తుది తీర్పు వెలువడే వరకు పరిరక్షించాలని కోరారు. ఎన్నికల ట్రిబ్యునల్‌ కోరినప్పుడు, పిటిషన్‌లోని పక్షాలు దరఖాస్తు చేసినప్పుడు ఫుటేజీని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 144 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం అధికారులందరి బాధ్యత అని నోటీసుల్లో గుర్తుచేశారు. వీడియో రికార్డింగ్‌ చేయకపోయినా, ఫుటేజీని తొలగించినా, ధ్వంసం చేసినా, భద్రపరచకపోయినా కోర్టు ధిక్కరణగా పరిగణించాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

ఇందుకోసం మరోసారి ఎలాంటి నోటీసులు ఇవ్వబోమని, తదుపరి పరిణామాలకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వీడియో ఫుటేజీ మాయమైనా, ధ్వంసమైనా ఆయా అంశాలను ఎన్నికల పిటిషన్లలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. వైయస్సార్‌సీపీకి, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు చట్టపరంగా అందుబాటులో ఉన్న ఇతర న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కులను కూడా కొనసాగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment