వైఎస్సార్ జిల్లాలో (YSR District) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ (Love) పేరుతో వేధిస్తున్న ఒక ఉన్మాది, పదహారేళ్ల విద్యార్థినిని అతి కిరాతకంగా గొంతుకోసి హత్య (Murder)చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగింది?
మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట అగ్రహారానికి చెందిన కీర్తన (Keerthana) (16) అనే బాలిక ఖాజీపేట మోడల్ స్కూల్‌లో (Khajipeta Model School) ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ (Avula Venkatesh) (19) అనే డిగ్రీ విద్యార్థి గత కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు సమాచారం.
శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వెంకటేష్ కీర్తనపై దాడికి తెగబడ్డాడు. కత్తితో ఆమె గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, పరిస్థితి విషమించడంతో చెన్నూరు వద్ద మార్గమధ్యలోనే కీర్తన ప్రాణాలు విడిచింది.
ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కీర్తన మృతితో ఖాజీపేటలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తక్షణమే అతనికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, గ్రామస్తులు ఖాజీపేటలో రాస్తారోకో చేపట్టారు.
పవన్ కల్యాణ్ స్పందించాలని విజ్ఞప్తి
ఈ దారుణ హత్య ఉదంతం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. “డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఈ ఘటనపై స్పందించాలి. ఇంత కిరాతకంగా గొంతుకోసి చంపిన నిందితుడిని వదిలిపెట్టకూడదు. మా చెల్లెలికి న్యాయం చేయాలి” అంటూ బాధితురాలి బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.








