జమిలి ఎన్నికల బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న వేళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల, భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి, బీజేపీ తన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటోందని షర్మిల ఆరోపించారు. మెజారిటీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బీజేపీ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టడం, వారి నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. జమిలి బిల్లు దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి అపహాస్యం
ఈ సందర్భంగా షర్మిల కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కూడా లేవనెత్తారు. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి? అసెంబ్లీల గడువును లోక్‌సభ కాలంతో ముడిపెట్టడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఐదేళ్ల కాలానికి తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలదే. జమిలి బిల్లు ద్వారా ఈ హక్కును కేంద్రం అపహస్యం చేస్తుందని ఆమె విమర్శించారు.
రాజ్యాంగ సవరణకు కావలసిన మూడింట రెండు వంతుల మెజారిటీ కూడా బీజేపీకి లేదని షర్మిల అన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించే జమిలి బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదని ఆమె స్పష్టం చేశారు.
నియంతృత్వ వైఖరే బీజేపీ లక్ష్యం
బీజేపీ అసలు ఉద్దేశం దేశంలో నియంతృత్వాన్ని ప్రవేశపెట్టడమేనని షర్మిల వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చే ఈ బిల్లుల ద్వారా ప్రజాస్వామ్య మూలసిద్ధాంతాలను బీజేపీ భంగం చేయాలని చూస్తోందని విమర్శించారు.