”ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏమిటి?”… ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగన్ 2.0 రాబోతోందని, తదుపరి 25-30 ఏళ్ల పాటు వైసీపీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ 1.0 ప్రభుత్వంలో లంచాలకు తావు లేకుండా రూ. 2.71 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందజేశామని, కోవిడ్ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేశామని జగన్ చెప్పారు. కానీ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిందని, సీఎం చంద్రబాబు కూటమి మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయని, వైసీపీ హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారన్నారు.
‘మొన్నటి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి కంటే మనకు 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. అందుకు కారణం.. చంద్రబాబులా తాను అబద్ధాలు చెప్పలేకపోవడమే’ అని వైఎస్ జగన్ అన్నారు. మరలా వచ్చేది జగన్ 2.0 పాలన.. చట్టవిరుద్దంగా అన్యాయాలు చేసే వారెవ్వరినీ వదిలిపెట్టేది లేదని, తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. ఈసారి జగన్ 2.0లో ప్రజలకు తోడుగా ఉంటూ కార్యకర్తలకు తోడుగా వారి ఇంటికి పెద్దన్నగా ఉంటానని భరోసా కల్పించారు. .
ప్రజాస్వామ్యం ఖూనీ.. గొప్పగా చెప్పుకుంటున్నారు..
ఈ ప్రభుత్వంలో ఏ మాదిరిగా పాలన చేస్తున్నారో చూస్తున్నాం. మొన్నటి స్దానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు, ప్రలోభపెట్టారు. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని అందరూ ఆలోచన చేయాలని జగన్ సూచించారు. ఇలాంటి రాజ్యం పోవాలి, ప్రజాస్వామ్యం నిలవాలి, విలువలు, వ్యక్తిత్వంతో కూడిన రాజకీయాలు ఎదగాలని అదే వైసీపీ సిద్ధాంతమని చెప్పారు.
ఇలాంటి ఈ వ్యక్తి చీటర్ కాదా?
మూలకు ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెటకారంగా మాట్లాడిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వ్యక్తీ చంద్రబాబును తమరెందుకు బటన్ నొక్కలేదని ప్రశ్నిస్తున్నారన్నారు. బటన్ ఎలా నొక్కాలో చెవిలో చెప్పమంటున్నాడని, మొహమాటం లేకుండా, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడన్నారు. ఇలాంటి ఈ వ్యక్తి చీటర్ కాదా?, ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా? అని ప్రశ్నించారు. ప్రజలందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలని వైఎస్ జగన్ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.