“అన్యాయంపై తిరగబడండి.. మీ అన్న తోడుగా ఉంటాడు”

"అన్యాయంపై తిరగబడండి.. మీ అన్న తోడుగా ఉంటాడు"

Summarize with AI

స్థానిక సంస్థల ఎన్నికల సాక్షిగా అధికార తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అరాచకాలు, ప్రజాస్వామ్య విధ్వంసంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పార్టీ నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలతో జరిగిన కీలక సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేస్తూ కూటమి ప్రభుత్వానికి, పక్షపాత అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

తన నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ శ్రేణులపై సాగుతున్న అణచివేత చర్యలను జగన్ తీవ్రంగా ఖండించారు. “పులివెందులలో మా వాళ్లపై చేయి వేస్తే నాపై చేయి వేసినట్టే. అన్యాయం చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టం. రేపు రిటైర్ అయినా సరే.. చట్టపరంగా పట్టుకుని బాధ్యులను బోనులో నిలబెడతాం” అని హెచ్చరించారు.

పోలీసులు చంద్రబాబు కోసం కాకుండా, రాజ్యాంగానికి చేసిన ప్రమాణాన్ని, తమ టోపీపై ఉన్న మూడు సింహాలను గుర్తుంచుకుని పనిచేయాలని హితవు పలికారు.

పులివెందుల, కడప జిల్లాల్లో నామినేషన్లను అడ్డుకోవడానికి పోలీసు యంత్రాంగం, టీడీపీ మూకలు సాగించిన బీభత్సంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థులపై పోలీసులు 37 రౌండ్లు తుపాకీ కాల్పులు జరపడం, 20 స్టన్ షెల్స్, 40 స్మోక్ షెల్స్, 7 హ్యాండ్ గ్రెనేడ్లు ఉపయోగించడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.

నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను తప్పించడానికే ఏకంగా 924 మంది వైసీపీ శ్రేణులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టారని మండిపడ్డారు. పులివెందులలో 40 వార్డులకు గాను కేవలం 20 వార్డుల్లోనే, 7 జెడ్పీటీసీ స్థానాల్లో 4 చోట్లే పోటీ చేసే పరిస్థితి కల్పించి ఏకగ్రీవాల ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు.

సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్ హామీలు నెరవేర్చలేక ప్రజలకు ముఖం చూపించలేకే చంద్రబాబు శకుని మాయాపాచికలతో ఎన్నికల ప్రక్రియను ఖూనీ చేస్తున్నారని మండిప‌డ్డారు. 50 శాతం రిజర్వేషన్లతో నామినేషన్లు వేయడానికి వచ్చిన అక్కచెల్లెమ్మల చీరలు లాగుతూ, నామినేషన్ పత్రాలు చించేస్తున్న పసుపు మూకలను చూస్తుంటే చంద్రబాబుకు సిగ్గుగా అనిపించడం లేదా అని నిలదీశారు.

“మూడేళ్లు గడిచిపోయాయి.. మిగిలింది రెండేళ్లే! ఆ తర్వాత వచ్చేది ‘జగన్ 2.0’. నా భద్రత, నా సంక్షేమం కంటే కార్యకర్తల సంక్షేమమే నాకు ముఖ్యం. మీపై పడే ఏ దెబ్బనూ మీ అన్న చూస్తూ ఊరుకోడు” అని భరోసానిచ్చారు.

“మన హక్కులను మనం కాపాడుకోకపోతే రేపు మన ఆస్తి పత్రాలను కూడా ఇలాగే లాక్కుని చించేస్తారు. తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు. పులివెందుల నుంచి మొదలయ్యే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తుంది. నేను స్వయంగా ఓటింగ్ రోజున పులివెందులకు వచ్చి బూత్‌లో నిలబడి ఓటు వేస్తాను” అని జగన్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment