‘మనం బ‌లంగాలేం.. ఆ నామినేష‌న్లు విత్‌డ్రా చేసుకోండి’

'మనం బ‌లంగాలేం.. ఆ నామినేష‌న్లు విత్‌డ్రా చేసుకోండి'

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన కార్యకర్తలకు, ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసి నామినేషన్లు వేసిన ఆశావహులకు ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోలుకోలేని షాక్ ఇచ్చారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల సీట్ల సర్దుబాటుపై ఆయన పూర్తిగా చేతులెత్తేశారు. తీవ్రమైన అర్నాబ్ తుఫాన్ కారణంగానే కూటమిలో సీట్ల సర్దుబాటు కుదరలేదని వ్యాఖ్యానిస్తూ.. టికెట్లు ఆశించి రెబల్స్‌గా నామినేషన్లు వేసిన జనసేన అభ్యర్థులందరూ తమ నామినేషన్లను తక్షణమే విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయ‌డంపై క్యాడర్ విస్మయం వ్యక్తం చేస్తోంది.

కూటమి పార్టీల అధ్య‌క్షుల ప్రెస్‌మీట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనూ, ముఖ్యంగా జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి, చర్చకు దారితీస్తున్నాయి.

నామినేషన్ల ఘట్టం ముగిసే కీలక సమయంలో ‘అర్నాబ్’ తుఫాను రావడంతో తెలుగుదేశం పార్టీతో కూర్చుని పూర్తిస్థాయిలో సీట్ల సర్దుబాటు చర్చలు జరపడం సాధ్యపడలేదని పవన్ నెపాన్ని తుఫానుపైకి నెట్టేయ‌డంపై జ‌న‌సేన క్యాడ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలం జనసేనకు లేదని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే అంగీకరించారు. జనసేనకు క్షేత్రస్థాయిలో కొంత బలమున్నప్పటికీ.. ఒక వ్యవస్థాగతమైన పెద్ద పార్టీగా రూపాంతరం చెంది భారీ స్థాయిలో స్వతంత్రంగా వెళ్లడానికి కనీసం మరో 25 ఏళ్ల సమయం పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంతోమంది ఆశావహులు నామినేషన్లు వేసి ఉండవచ్చని, కొందరు ఓట్లేసి, పార్టీ కోసం తిరిగి ఉండవచ్చని పేర్కొంటూనే.. బీ-ఫామ్స్ లభించిన అధికారిక అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. స్వతంత్రులుగా, రెబల్స్‌గా నామినేషన్లు వేసిన జనసైనికులంతా కూటమి విజయానికి భంగం కలగకుండా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు గానీ, పార్టీల బలాబలాలకు గానీ ఎలాంటి రిఫరెండం కాదని చెబుతూ, కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు సరైన ప్రాతినిధ్యం, పదవులు దక్కుతాయని ఆశించిన వేలాది మంది జనసేన కార్యకర్తలకు పవన్ ప్రకటన పిడుగుపాటులా మారింది.

సీట్లు దక్కకపోయినా కష్టపడి నామినేషన్లు వేస్తే, ఇప్పుడు ఏకంగా “టీడీపీ ముందర మనం బలహీనులం.. నామినేషన్లు ఉపసంహరించుకోండి” అని పవన్ కళ్యాణ్ బహిరంగంగా చేతులెత్తేయడంపై క్షేత్రస్థాయి నాయకులు, శ్రేణులు తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment