---Advertisement---

తోలుతీస్తాం.. కూట‌మికి వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌

తోలుతీస్తాం.. కూట‌మికి వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌
---Advertisement---

ప్రొద్దుటూరు, వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంత‌పురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ స్థానిక సంస్థల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ నేత‌ల‌తో వైఎస్ జ‌గ‌న్ గురువారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఉప ఎన్నిక‌ల్లో తెగువ చూపించిన వైసీపీ నేత‌ల‌కు సెల్యూట్ చేసిన జ‌గ‌న్‌.. కూట‌మి ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో యుద్ధ వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నార‌ని, దుర్మార్గమైన, రెడ్‌ బుక్‌ పాలన ఆంధ్రరాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరని కీల‌క‌ వ్యాఖ్య‌లు చేశారు. అయినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే తోలుతీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైసీపీకి ఉంద‌న్నారు. ప్రతి గ్రామం నుంచి వైసీపీ కార్యకర్త లేచి నిలబ‌డి కూట‌మిని నిల‌దీస్తాడని ఉప ఎన్నిక‌ల విజ‌యం ద్వారా చాటి చెప్పామ‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు.

ప్రజల్లోకి వెళ్లాలంటే టీడీపీకి భ‌యం..
గ్రామాల్లోకి వెళ్లి బాగున్నారా అని పలకరించే ధైర్యం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు చంద్ర‌బాబు లేకుండా చేశార‌న్నారు వైఎస్ జ‌గ‌న్. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లల నుంచి నా రూ.15వేలు ఏమయ్యాయని ప్రశ్నించడం మొదలు పెడతారన్నారు. రూ.18 వేలు ఏమయ్యాయని అక్క‌చెల్లెమ్మ‌లు, నా రూ.26 వేల సంగతేమైందని రైతులు అడుగుతార‌న్నారు. అందుకనే చంద్రబాబుకు చెందిన ఏ కార్యకర్త ప్రజల ఇళ్లల్లోకి వెళ్లి బాగున్నారా అని అడిగే ధైర్యం చేయ‌డం లేద‌న్నారు. ఉచిత బ‌స్సు సౌక‌ర్యం హామీ ఏమైంద‌ని ప్ర‌తి గ్రామంలో అక్కచెల్లెమ్మలు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నార‌న్నారు.

అంచనాల్లో దారుణ పెరుగుదల
అమ‌రావ‌తి నిర్మాణ టెండ‌ర్ల‌పై వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమరావతిలో నిర్మాణాలకు 2018లో చంద్రబాబు హయాంలో పిలిచిన‌ టెండర్ల విలువ రూ.36 వేల కోట్లు కాగా, అప్పటి కంటే ఇప్పుడు స్టీలు, సిమెంటు రేట్లు తగ్గినా, ఆ పనుల అంచనాను ఏకంగా రూ.78వేల కోట్లకు పెంచారన్నారు. టెండర్లు రింగ్‌ ఫార్మ్‌ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారన్నారు. అంతే కాకుండా మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల‌ని ప‌ని ప్రారంభానికి ముందే 10 శాతం డ‌బ్బు కాంట్రాక్ట‌ర్ల‌కు ముట్ట‌జెప్పే కొత్త‌ర‌కం విధానం తీసుకొచ్చాడ‌ని, వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్ర‌బాబు తీసుకుంటాడని, అలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారని వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు.

జ‌గ‌న్ నోట ఉర్సా కంపెనీ మాట‌..
విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీకి రూ.3వేల కోట్ల విలువైన భూములు క‌ట్ట‌బెట్టార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3వేల కోట్ల విలువ చేసే భూమి, ఎక‌రాకు రూ.99 పైస‌ల‌కే కేటాయించ‌డం ఏంట‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో, లేదో తెలియదు కానీ, చంద్రబాబునాయుడు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇచ్చి.. నీకింత నాకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇంకా విశాఖలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500 కోట్ల నుంచి 2 వేల కోట్ల విలువైన భూములు ఇచ్చి, అక్కడ కూడా నాకింత, నీకింత అని పంచుకుంటున్నారు. లెఫ్ట్‌ రైట్‌ సెంటర్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నార‌న్నారు.

కచ్చితంగా గెలుస్తాం..
మంచి చేసిన వైసీపీ ప్రతిపక్షంలో కూర్చుంద‌ని, ఏ మంచీ చేయని చంద్రబాబు పరిస్ధితి మున్ముందు చాలా దారుణంగా ఉంటుంద‌న్నారు వైఎస్ జ‌గ‌న్‌. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుందని చెప్పారు. మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్‌ డిజిట్‌ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారని, తప్పకుండా ఆరోజు వస్తుందన్నారు వైఎస్ జ‌గ‌న్‌. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైసీపీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. అధికారంలోకి వ‌చ్చిన తర్వాత జగన్‌ 2.0లో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాన‌ని చెప్పారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment