లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ ఎంపీ గురుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి బదులుగా ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హామీలు అమలు చేయలేకపోయిందని, కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాటలకే పరిమితమైందని దుయ్యబట్టారు.
వైసీపీ పథకాలతో ప్రజలకు మేలు
లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ గత వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయం, పారదర్శకత విషయంలో ఎంతో కృషి చేసినట్టు ప్రశంసించారు. జగన్ ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత వంటి పథకాలు ఆణగారిన వర్గాలకు ఎంతగానో ఉపకరించాయన్నారు. ఈ పథకాలు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్ద మేలు చేకూర్చాయి.
రాజ్యాంగం పై గురుమూర్తి విశ్లేషణ
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, స్వేచ్ఛను ప్రతిబింబించే సాధనంగా ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. కేశవానంద భారతి కేసు ద్వారా రాజ్యాంగం పునాది మరింత బలపడిందని అన్నారు. అలాగే, భారత్ 75 ఏళ్ల ప్రయాణంలో గొప్ప ప్రగతి సాధించిందని, ప్రపంచంలో అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలిచిందని చెప్పారు.