భారత క్రికెట్ (India Cricket) నియంత్రణ బోర్డు (BCCI) కి ఉత్తరాఖండ్ (Uttarakhand) హైకోర్టు (High Court) నోటీసులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (CAU)కు ఇచ్చిన రూ.12 కోట్లలో నిధుల దుర్వినియోగంపై ఈ నోటీసులు ఇచ్చారు. ఆడిట్ నివేదిక ప్రకారం, ఈ డబ్బులో రూ.35 లక్షలు కేవలం ఆటగాళ్లకు అరటిపండ్లు కొనడానికి ఖర్చు చేశారు. ఈ విషయంలో విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నిధుల దుర్వినియోగం ఆరోపణలు
టైమ్స్ ఆఫ్ ఇండియా(Times Of India) నివేదిక ప్రకారం, పిటిషనర్లు దాఖలు చేసిన వివరాల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అరటిపండ్లకు (Bananas) రూ.35 లక్షలు: రూ.12 కోట్ల నిధుల్లో రూ.35 లక్షలు కేవలం ఆటగాళ్లకు అరటిపండ్లు కొనుగోలు చేయడానికి ఖర్చు చేశారు.
భారీ ఖర్చులు: ఆడిట్ నివేదిక ప్రకారం, ఈవెంట్ నిర్వహణకు రూ.6.4 కోట్లు, టోర్నమెంట్-ట్రయల్ ఖర్చులకు రూ.26.3 కోట్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం ఖర్చుల కంటే చాలా ఎక్కువ. ఆహారం, పానీయాల పేరుతో అక్రమాలు: ఉత్తరాఖండ్ అసోసియేషన్ ఆహారం, పానీయాల పేరుతో కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసిందని పిటిషనర్లు ఆరోపించారు.
గతంలోనూ ఆరోపణలు
ఉత్తరాఖండ్ క్రికెట్ బోర్డు గతంలో కూడా అనేక వివాదాల్లో చిక్కుకుంది. 2022లో, ఆటగాళ్లకు రోజుకు సగటున రూ.100 మాత్రమే చెల్లించినట్లు వెల్లడైంది, ఇది కనీస వేతనం కంటే కూడా తక్కువ. అలాగే, ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా వేధించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. పలు నియామకాల్లో కూడా అక్రమాలు జరిగాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కేసుపై తదుపరి విచారణ సెప్టెంబర్ 19న జరగనుంది.








