భారతదేశంలో (India) తీవ్ర పేదరికంలో (Extreme Poverty) జీవిస్తున్న వారి సంఖ్య 2011-12లో 344.47 మిలియన్ల నుండి 2022-23లో 75.24 మిలియన్లకు తగ్గినట్లు (Reduced) ప్రపంచ బ్యాంకు (World Bank) తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ దారిద్య్ర రేఖ (International Poverty Line) రోజుకు $3.00 ఆధారంగా, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. 2011-12లో 27.1% ఉన్న పేదరిక రేటు 2022-23 నాటికి 5.3%కి తగ్గింది, దాదాపు 269 మిలియన్ మంది తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారు.
ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2017 ధరల ఆధారంగా రోజుకు $2.15 దారిద్య్ర రేఖ వద్ద, తీవ్ర పేదరికంలో ఉన్నవారి వాటా 2011-12లో 16.2% నుండి 2022లో 2.3%కి తగ్గింది. ఈ రేఖ కింద జీవిస్తున్నవారి సంఖ్య 205.93 మిలియన్ల నుండి 33.66 మిలియన్లకు పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర పేదరికం 18.4% నుండి 2.8%కి, పట్టణ ప్రాంతాల్లో 10.7% నుండి 1.1%కి తగ్గింది.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు 2011-12లో దేశంలోని 65% పేదలను కలిగి ఉండగా, 2022-23 నాటికి ఈ రాష్ట్రాలు మొత్తం పేదరిక తగ్గింపులో రెండు మూడవ వంతులకు దోహదపడ్డాయి. బహుమితీయ పేదరిక సూచిక (MPI) 2005-06లో 53.8% నుండి 2019-21లో 16.4%కి, 2022-23లో 15.5%కి తగ్గింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత 11 ఏళ్లలో పేదరిక నిర్మూలనకు విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana), ఉజ్వల యోజన (Ujjwala Yojana), జన్ ధన్ యోజన (Jan Dhan Yojana), ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) వంటి పథకాలు గృహనిర్మాణం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణలో పురోగతిని సాధించాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT), డిజిటల్ చేరిక, గ్రామీణ మౌలిక సదుపాయాలు పారదర్శకతను, ప్రయోజనాల వేగవంతమైన అందింపును నిర్ధారించాయి. ఫలితంగా, 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు.