విశాఖలో కిడ్నాప్ కలకలం.. ట్రాప్ చేసి హత్యాయత్నం

విశాఖలో కిడ్నాప్ కలకలం.. ట్రాప్ చేసి హత్యాయత్నం

విశాఖ నగరంలో(Visakhapatnam City) ఒక యువకుడి కిడ్నాప్(Kidnap), హత్యాయత్నం (Attempt to Murder) ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఒక యువతి వ్యవహారంలో ఇద్దరు యువకుల మధ్య నడిచిన గొడవ కాస్తా.. కిడ్నాప్, మారణాయుధాలతో దాడి చేసే వరకు వెళ్లింది. ఈ దాడిలో భాస్కర్ బాలాజీ (Bhaskar Balaji) అనే యువకుడు తీవ్రంగా గాయపడగా, పోలీసులు సకాలంలో స్పందించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. పెరిగిన వివాదం
పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు భాస్కర్ బాలాజీకి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా ఒక యువతితో పరిచయం ఏర్పడింది. అయితే, అదే యువతికి అప్పటికే ప్రణీత్ అలియాస్ సున్యో (Praneeth alias Sunyo) అనే మరో యువకుడితో పరిచయం ఉంది. ఈ క్రమంలో సదరు యువతికి దూరంగా ఉండాలంటూ ప్రణీత్ గతంలోనే భాస్కర్ బాలాజీని హెచ్చరించాడు. అయినప్పటికీ బాలాజీ వినకపోవడంతో, అతడిపై కక్ష పెంచుకున్న ప్రణీత్ ఎలాగైనా కిడ్నాప్ చేసి అంతమొందించాలని స్కెచ్ వేశాడు.

మరో యువతితో హనీ ట్రాప్.. ఆపై కిడ్నాప్
భాస్కర్ బాలాజీని పట్టుకునేందుకు ప్రణీత్ (Praneeth) ఒక పక్కా ప్లాన్ ప్రకారం ‘హనీ ట్రాప్'(Honey Trap) వేశాడు. ఇందుకోసం తనకు తెలిసిన మరో యువతితో బాలాజీకి ఎర వేశాడు. ఆ యువతి మాటలు నమ్మి, ఆమెను కలిసేందుకు భాస్కర్ బాలాజీ బయలుదేరాడు. ముందే వేసుకున్న వ్యూహం ప్రకారం.. బాలాజీ అక్కడికి చేరుకోగానే ప్రణీత్ తన గ్యాంగ్‌తో కలిసి అతడిని ఒక ఆటోలో బలవంతంగా కిడ్నాప్ చేశాడు.

కిడ్నాప్ చేసిన అనంతరం బాధితుడిని నిర్మానుష్య ప్రాంతమైన భైరవకోనకు తరలించారు. అక్కడ మారణాయుధాలతో భాస్కర్ బాలాజీపై ప్రణీత్ ముఠా విచక్షణారహితంగా దాడి చేసి, హత్యాయత్నానికి ఒడిగట్టింది.

ఐదుగురు నిందితులు అరెస్ట్
ఈ ఘోర దాడి నుండి ప్రాణాలతో బయటపడిన బాధితుడు భాస్కర్ బాలాజీ తృటిలో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం సహా ఐదు తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్‌తో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని (మొత్తం ఐదుగురు నిందితులను) పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment