యంగ్ హీరో అశోక్ గల్లా, నటి గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘వీసా – వింటారా సరదాగా’ విడుదల తేదీ ఖరారైంది. నూతన సంవత్సర కానుకగా 2027 జనవరి 1న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రేమ, స్నేహం, వినోదం కలగలిసిన కథతో దర్శకుడు ఉద్భవ్ రఘు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఉన్నత చదువులు, మెరుగైన భవిష్యత్తు కోసం స్వదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లే తెలుగు విద్యార్థుల జీవితాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలు, ఎదురయ్యే సరదా పరిస్థితులను వినోదాత్మకంగా చూపించనున్నారు. ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. అశోక్ గల్లా, గౌరీ ప్రియ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూత్‌ఫుల్ కథాంశంతో పాటు పాటల ప్రచారానికి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో అశోక్ గల్లా, గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘చెన్నై లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన గౌరీ ప్రియ.. ఇప్పుడు ‘వింటారా సరదాగా’తో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 2027 జనవరి 1న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా యువతను, ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలని ఆశించే విద్యార్థులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.








