విజయవాడ టెర్రర్ లింక్స్.. ‘ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో జిహాదీ నెట్‌వర్క్

విజయవాడ టెర్రర్ లింక్స్.. 'ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్' పేరుతో జిహాదీ నెట్‌వర్క్

Summarize with AI

విజయవాడలో (Vijayawada) అరెస్టయిన ముగ్గురు యువకుల వెనుక ఉన్న ప్రమాదకరమైన ఉగ్రవాద నెట్‌వర్క్ (Terrorist Network) గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉగ్ర క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో విజయవాడ వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్‌ (Counter Intelligence) అధికారుల తనిఖీలు చేప‌ట్టి, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాకుండా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వీరి విచారణలో వెల్లడైన సమాచారంతో ఏపీ(AP) కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి.

ఏడు రాష్ట్రాల్లో 42 మందితో గ్రూప్!
నిందితులు మహమ్మద్ షరీఫ్ (Mohammad Sharif), మీర్జా సొహైల్ బేక్ (Mirza Sohail Baig), మహమ్మద్ డ్యానిష్‌ల (Mohammad Danish) నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను విశ్లేషించగా కీలక సమాచారం లభ్యమైంది. ఈ ముగ్గురు ‘ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ (All Malik Islamic Youth) అనే పేరుతో ఒక రహస్య గ్రూప్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. ఇందులో ఏడు రాష్ట్రాలకు చెందిన 42 మంది సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దేశాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనే కుట్రతో పాటు, భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను పెడుతూ పోస్టులు చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో మిలిటెంట్ శిక్షణకు వెళ్లాలని వీరు యువతను ప్రోత్సహిస్తున్నట్లు, అక్కడి ఉగ్రమూకలతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు వెల్లడైంది.

ముజాహిదీన్ తరహాలో ఫోటో షూట్లు
ముజాహిదీన్ ఉగ్రవాదుల మాదిరిగా ముఖానికి మాస్కులు ధరించి, ఆయుధాలతో ఉన్నట్లుగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ‘ఖిలాఫత్ ఐడియాలజీ’ని వ్యాప్తి చేస్తూ యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు వీరు ఆడియో క్లిప్పింగులు, మెసేజ్‌లను భారీగా షేర్ చేసినట్లు సమాచారం.

వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు
ఈ కేసులో లోతైన విచారణ కోసం విజయవాడ పోలీసులు మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపారు. అక్కడ ఉన్న ఆ 42 మంది సభ్యులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు కీలక విజ్ఞప్తి చేశారు.

“పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలపై నిఘా ఉంచాలి. జిహాదీ గ్రూపులు, మిలిటెంట్ కార్యకలాపాలు దేశ భద్రతకు గొడ్డలిపెట్టు. యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment