విజయవాడలో డయేరియా కలకలం.. ఒకరి మృతి

విజయవాడలో డయేరియా కలకలం.. ఒకరి మృతి

విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటను డ‌యేరియా వ్యాధి బ‌య‌పెడుతోంది. కాల‌నీలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వాంతులు, విరేచనాలతో పలువురు ప్ర‌జ‌లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. డ‌యేరియా కార‌ణంగా శ్రీరామ నాగమణి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల స‌మాచారం ప్ర‌కారం ఇప్పటివరకు 16 మందిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మరో ఆరుగురు స్థానిక పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వైద్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. డీఎం&హెచ్ఓ సుహాసిని మాట్లాడుతూ, ఇప్పటి వరకూ ప్రజల అనారోగ్యానికి ఖచ్చితమైన కారణం తేలలేదని తెలిపారు. అయితే, మంచినీటి కాలుష్యమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నామని బాధితులు చెబుతున్నారు.

రంగుమారిన నీళ్లు తాగుతున్నాం..
ఆ ప్రాంతంలో కలుషిత నీటి సరఫరా కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆరోపణలు వస్తుండగా, వైద్య శాఖ పూర్తి స్థాయి విచారణ ప్రారంభించింది. కాగా, ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌లు, డిప్యూటీ మేయ‌ర్ ఇంటింటికీ వెళ్లి పరిస్థితుల పై ఆరాతీశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఇంటిలో ఒకరికి అనారోగ్యంగా ఉంద‌న్నారు. తమ కాలనీల్లో పారిశుధ్యంపై ప్ర‌జ‌లు ఫిర్యాదు చేశారు. కనీసం డ్రైనేజీల్లో పూడికలు తీయడం లేదంటూ, రంగు మారిన నీరు తాగుతున్నాంటూ కాల‌నీ వాసులు వాపోయారు. కాలనీ వాసులు రంగు మారిన నీటిని మల్లాది విష్ణుకి చూపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment