కేరళం కొత్త సీఎంగా వి.డి. సతీశ‌న్

కేరళం కొత్త సీఎంగా వి.డి. సతీశ‌న్

కేరళం రాజకీయాల్లో గత పది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రతిపక్ష నేత వి.డి. సతీశ‌న్ (V.D. Satheesan) పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ (UDF) ఘనవిజయం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి ఎంపికపై జరిగిన సుదీర్ఘ కసరత్తు అనంతరం ఏఐసీసీ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

సతీసన్ వైపే మొగ్గు
మే 4న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. ముఖ్యమంత్రి పదవి కోసం వి.డి. సతీశ‌న్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మెజారిటీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపు మొగ్గు చూపినప్పటికీ, క్షేత్రస్థాయిలో సతీశ‌న్‌కు ఉన్న ప్రజాదరణ, గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఆయన పోరాట పటిమను పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్ ఆయననే సీఎంగా ఎంపిక చేసింది. చివరి నిమిషంలో కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకోవడంతో సతీసన్ ఎన్నిక సుగమమైంది.

వి.డి. సతీశ‌న్ ప్రస్థానం
1964 మే 31న ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరులో జన్మించారు. కేరళం విద్యార్థి సంఘం (KSU) ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, పారావూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 2001, 2006, 2011, 2016, 2021, ప్రస్తుత 2026 ఎన్నికల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుండి అసెంబ్లీలో ప్రభుత్వంపై ఆయన చేసిన పోరాటాలు యూడీఎఫ్ విజయానికి బాటలు వేశాయి.

విజయానికి కారణం ఇదేనా?
కేరళంలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పదేళ్ల పాలనకు వ్యతిరేకంగా సతీశ‌న్ సాగించిన పోరాటం సామాన్యులను ఆకట్టుకుంది. అవినీతి ఆరోపణలు, పాలనా వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన సఫలీకృతమయ్యారు. నేడు మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేపీసీసీ కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో ఎమ్మెల్యేలు అధికారికంగా ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. త్వరలోనే ఆయన కేరళ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment