తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడారనే చిన్న కారణంతో.. ఒక పేద కుటుంబంపై దాడి చేయడమే కాకుండా, పోలీసులను అడ్డం పెట్టుకుని వారిపై దొంగతనం తప్పుడు కేసు బనాయించాడు. చివరకు పోలీస్ స్టేషన్ సాక్షిగానే బాధితులతో బలవంతంగా కాళ్లు మొక్కించుకుని తన అధికార పిచ్చిని ప్రదర్శించాడు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నేత లుకస్ చేసిన ఈ అరాచక పర్వం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగింది?
బిహార్ రాష్ట్రానికి చెందిన లీలావతి, ఆమె భర్త ఉప్పల్ ఐడీఏ (IDA) పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో నివాసం ఉంటున్నారు. మే 25వ తేదీ సాయంత్రం వారి ఇద్దరు కుమారులు మరికొంత మంది స్థానిక పిల్లలతో కలిసి కాలనీ రోడ్డుపై క్రికెట్ ఆడుతున్నారు.
అదే కాలనీలో నివసించే కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత లుకస్.. “నా ఇంటి ముందే క్రికెట్ ఆడుతారా?” అంటూ తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కి పిల్లలను బూతులు తిట్టడం ప్రారంభించాడు. దీనిపై లీలావతి అనే మహిళ సదరు నేతను ప్రశ్నించగా.. అధికార బలంతో రెచ్చిపోయిన లుకస్, ఆమెపై బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలో ఆమె వస్త్రాలు చిరిగిపోయాయి. భార్యపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన లీలావతి భర్తపై కూడా లుకస్ రక్తం వచ్చేలా విచక్షణారహితంగా కొట్టాడు.
దంపతులపై తానే దాడి చేసిన లుకస్.. ఉల్టా దొంగ దొరికినట్లు అధికార పార్టీ అండతో ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించి బాధితులను స్టేషన్‌కు తరలించాడు. తమపై జరిగిన దాడి గురించి వివరించి, గాయాలతో స్టేషన్‌కు వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి ఉప్పల్ పోలీసులు నిరాకరించారు. అధికార పార్టీ నేత ఒత్తిళ్లకు లొంగి ఏకపక్షంగా వ్యవహరించారు.
కాంగ్రెస్ నేత లుకస్ దంపతులపై దాడి చేస్తున్న వీడియోలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేయడంతో సదరు నేత అప్రమత్తమయ్యాడు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. లీలావతి కుటుంబం తన ‘బంగారు గొలుసు’ దొంగతనం చేసిందంటూ అక్రమ ఫిర్యాదు ఇచ్చాడు.
పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కించుకున్న వైనం
రాత్రివేళ పోలీస్ స్టేషన్‌లో ఉంచి వేధిస్తుండటం, పైగా తమపై ఎక్కడ దొంగతనం కేసు పెడతారోననే భయంతో ఆ పేద దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దొంగతనం కేసు పెట్టొద్దని, తాము తప్పు చేయలేదని ఆ కాంగ్రెస్ నేతను వేడుకున్నారు.
దీనిని అలుసుగా తీసుకున్న లుకస్ మరింత బరితెగించి.. “నా కాళ్లు మొక్కి, తప్పు చేశామని ఒప్పుకుంటేనే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటా.. లేదంటే జైల్లో పెట్టిస్తా” అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గత్యంతరం లేని పరిస్థితిలో, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసుల కళ్ల ముందే బాధితులు ఆ కాంగ్రెస్ నేత కాళ్లు మొక్కాల్సి వచ్చింది. ఆ తర్వాతే సదరు నేత లీలావతి కుటుంబంపై పెట్టిన తప్పుడు ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు.
కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడారని వారి తల్లిదండ్రులపై దాడి చేసి.. దొంగతనం చేశారని తప్పుడు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026
రాత్రివేళ దంపతుల్ని పోలీస్ స్టేషన్‌కు పంపించి వేధింపులకు గురిచేసి.. కాళ్లు మొక్కితేనే కేసు వాపస్ తీసుకుంటానని బెదిరింపు
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికార… pic.twitter.com/1zD9Hq8KZ5









రాజధాని కట్టుకునే చేతకాదు, తెలంగాణలో విస్తరిస్తారా?.. – కవిత (Video)