రాజధాని అమరావతి (Amaravati) పరిధిలోని ఉండవల్లి రైతులు (Undavalli Farmers) ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ)కు (Land Pooling) వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ నిబంధనల నుంచి శాశ్వతంగా మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఉండవల్లి గ్రామస్థులు, రైతులు(Farmers) భారీ సంఖ్యలో గుంటూరు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ భూములను బలవంతంగా లాక్కోవద్దని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
గ్రీన్ జోన్‌తో మరింత నష్టం!
సీఆర్డీఏ (CRDA) నిబంధనల ప్రకారం తమకు రిటర్నబుల్ ప్లాట్స్ (Returnable Plots) ఇవ్వడం సాధ్యం కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న గ్రీన్ జోన్(Green Zone), ఈ-1 జోన్ (E-1 Zone) నిబంధనల వల్ల తాము ఆర్థికంగా పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా తమ భూములను కాపాడుకోవడానికి శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తున్నామని, అయినా ప్రభుత్వం (Government) తమ సమస్యను గుర్తించడం లేదని మండిపడ్డారు.
ఇప్పటికే ఇచ్చిన భూములు సరిపోవా?
ఉండవల్లి రైతులు తమ వినతిపత్రంలో పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే ఇతర ప్రాంతాల రైతులు ఇచ్చిన భూములు పూర్తిగా సరిపోతాయని, మళ్లీ తమ భూములను లాక్కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని.. సీడ్ యాక్సెస్ రోడ్డు (Seed Access Road) నిర్మాణానికి, కొండవీటి వాగు (Kondaveeti Vagu) అభివృద్ధికి సహకరించి అవసరమైన భూములను ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చామని గుర్తుచేశారు.
ఇప్పుడు మళ్లీ ల్యాండ్ పూలింగ్ పేరుతో సాగు భూములను తీసుకుంటే తాము జీవనాధారం కోల్పోయి రోడ్డున పడతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ న్యాయం చేయాలి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్(Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)లు స్పందించి తమకు న్యాయం చేయాలని ఉండవల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ గ్రామాన్ని భూ సమీకరణ నుంచి శాశ్వతంగా తొలగించే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు తేల్చిచెప్పారు. కలెక్టరేట్ (Collectorate) వద్ద రైతుల ఆందోళనతో గుంటూరులో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.








