ఢిల్లీలో నవంబర్ 1న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ (INDIA) కూటమి నిర్వహించనున్న నిరసన ర్యాలీకి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ కోరగా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరాకరించారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వద్ద ధర్నాకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రత్యేక రైళ్లు కేటాయించకపోతే, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
మరోవైపు, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ పేరుతో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సుమారు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ తెలిపింది. ఓటర్ల జాబితాల పారదర్శకత, ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణ కోసం ఈ నిరసన చేపడుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.








