“80 ఏళ్లకు ప‌వ‌న్‌ సీఎం అవుతారా?”

"80 ఏళ్లకు ప‌వ‌న్‌ సీఎం అవుతారా?"

Summarize with AI

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఉనికికే పెద్ద ప్రమాదకరంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేత మాధవ్‌లతో కలిసి నిర్వహించిన పత్రికా సమావేశంలో.. జనసేన బలాబలాల గురించి, సీట్ల పంపకాలపై పవన్ మాట్లాడిన తీరు జనసేన కార్యకర్తలను, ఆశావహులను తీవ్ర నిరాశలోకి తోసేసింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయస్సు 55 సంవత్సరాలు. మరో 25 ఏళ్లు ఆగితే ఆయన వయస్సు 80 ఏళ్లకు చేరుకుంటుంది. “పార్టీ బలోపేతం కావడానికి, పూర్తిస్థాయిలో అధికారంలోకి రావడానికి మరొక 25 సంవత్సరాల సమయం పడుతుంది” అని పవన్ వ్యాఖ్యానించడంపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లో ఏ పార్టీ నాయకుడైనా తమ పార్టీని అధికారంలోకి తెస్తామని, కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తారు. కానీ, స్వయంగా పార్టీ అధినేతే “మేము బలహీనులం, మాకు ఇంకా 25 ఏళ్లు పడుతుంది” అని చేతులెత్తేస్తే ఇక కార్యకర్తలు, ఆశావహులు ఎందుకు పార్టీని అంటిపెట్టుకుని ఉంటారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తీరుపై జనసేన సానుభూతిపరులు, కార్యకర్తలు ఎక్స్, ఫేస్‌బుక్‌లలో తీవ్రంగా మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ పార్టీ జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొన్న తమ కష్టాన్ని పవన్ ఒక్క మాటతో గంగలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పవన్ కళ్యాణ్ మొదటినుంచీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తూ వచ్చారని స్పష్టమవుతోంది.

2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి, టీడీపీ-బీజేపీ కూటమి గెలుపు కోసమే రాష్ట్రమంతా ప్రచారం చేశారు.

2019 ఎన్నికల్లో చంద్రబాబుపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి, వ్యతిరేక ఓటును చీల్చడానికే విడిగా పోటీ చేశారనే విమర్శలు మూటగట్టుకున్నారు.

2024లో చంద్రబాబుకు జనసేన మద్దతు అత్యంత అనివార్యమని తెలిసినప్పటికీ, డిమాండ్ చేసి తగినన్ని సీట్లు సాధించకుండా తక్కువ స్థానాలకే రాజీపడిపోయారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో జనసేనను దెబ్బతీసేందుకు, ఆ పార్టీ ఉనికి లేకుండా చేయడానికి టీడీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు పట్ల పూర్తి రాజీ ధోరణినే అవలంబిస్తున్నారని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉందంటూ సీట్లు తగ్గించుకోవడం, నామినేషన్లు వేసిన తమ అభ్యర్థులనే వెనక్కి తగ్గుతూ విత్‌డ్రా చేసుకోవాలని కోరడం పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ చారిత్రక తప్పిదమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పరువును, కార్యకర్తల భవిష్యత్తును చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని, పవన్ తాజా ప్రకటనలు జనసేనను కోలుకోలేని దెబ్బతీశాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment