గుంటూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరోసారి వీరంగం సృష్టించాయి. చేతుల్లో కర్రలు, ఇనుప రాడ్లతో బీభత్సం సృష్టిస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరులోని గోరంట్లలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు ముందస్తు ప్రణాళికతో తనపై దాడికి యత్నించారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ దేవుడి ప్రసాదాన్ని రాజకీయం చేసిన కూటమి నేతలపై అంబటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని సీబీఐ తేల్చినప్పటికీ, మళ్లీ దేవుడిపై నిందలు వేసేలా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దారుణమని ఆయన ఖండించారు. “24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే నేనే వచ్చి చించేస్తా” అంటూ అంబటి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఫ్లెక్సీలు తొలగించేందుకు వెళ్లిన సమయంలోనే దాడికి ప్రయత్నం జరిగిందని సమాచారం. ముందస్తు కుట్రలో భాగంగా కర్రలు, రాడ్లతో సిద్ధంగా ఉన్న టీడీపీ శ్రేణులు అంబటిపై దూసుకెళ్లేందుకు ప్రయత్నించాయి.
నిన్న తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహిస్తుండగా, వంద మందికిపైగా టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అరాచకం సృష్టించారని ఆరోపించారు. అలాగే చిలకలూరిపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్న వైసీపీ నేత విడదల రజినిపై కూడా టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించారని తెలిపారు.
భూమన, విడదల రజినీ, మరుసటి రోజు అంబటి రాంబాబుపై దాడి ప్రయత్నాలు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని వైసీపీ మండిపడుతోంది. ప్రతిపక్ష నేతలపై వరుస దాడులకు ప్రభుత్వం పురిగొల్పుతోందని మండిపడుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా టీడీపీ శ్రేణులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై డీజీపీ తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.








