కౌంటింగ్ ప్రారంభం.. తమిళనాడు సీఎం పీఠం ఎవరిది?

కౌంటింగ్ ప్రారంభం.. తమిళనాడు సీఎం పీఠం ఎవరిది?

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 234 నియోజకవర్గాలకు గానూ ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 85 శాతం ఓటింగ్ నమోదైంది. దాదాపు 5.73 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయగా, నేడు వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కౌంటింగ్ ప్రక్రియ ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కింపు మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి, ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 3.6 లక్షల మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, సీసీటీవీ పర్యవేక్షణతో పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతోంది. సమస్యాత్మక జిల్లాలుగా గుర్తించిన కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెంకాసిలలో కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

రంగంలో హేమాహేమీలు
ఈ ఎన్నికల్లో ప్రధానంగా డీఎంకే (DMK), ఏఐడీఎంకే (AIADMK) కూటమిలతో పాటు, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ గట్టి పోటీని ఇస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ (కొళత్తూరు), మాజీ సీఎం పళనిస్వామి (ఎడప్పాడి) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. యువ నేత ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి పోటీలో ఉండగా, టీవీకే అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలోకి దిగారు.

హంగ్ భయం.. మొదలైన క్యాంప్ రాజకీయాలు!
మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే, సర్వేలు ‘హంగ్’ వచ్చే అవకాశం ఉందని సూచించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫలితాల అనంతరం అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు రాజకీయ పార్టీలు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నాయి. ముఖ్యంగా టీవీకే అధినేత విజయ్ అప్పుడే ‘రిసార్ట్ రాజకీయాలకు’ తెరలేపారు. మహాబలిపురం వద్ద ప్రత్యేకంగా రిసార్ట్‌లను బుక్ చేసి, గెలిచిన అభ్యర్థులు వెంటనే అక్కడికి చేరుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ల ట్రెండ్స్ వస్తుండగా, మధ్యాహ్నానికి పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల్లో ఈసారి కొత్త సమీకరణాలు కనిపిస్తాయా? లేక పాత సంప్రదాయమే కొనసాగుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment