పెద్దారెడ్డిని ఇరికించేందుకు ఇంత‌కు దిగ‌జారాలా..?

పెద్దారెడ్డిని ఇరికించేందుకు ఇంత‌కు దిగ‌జారాలా..?

Summarize with AI

ఏపీలో రాజ‌కీయాలు ఎలా త‌యార‌య్యాయో కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రీ ముఖ్యంగా తాడిప‌త్రిలో పాలిటిక్స్ దారుణం. హైకోర్టు ఆర్డ‌ర్ ఉన్నా.. రెండేళ్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యేను తాడిప‌త్ర పొలిమేర కూడా తాక‌నివ్వ‌కుండా పొలిటిక‌ల్ గేమ్ న‌డిచింది. ఆ త‌రువాత అధికార‌ టీడీపీ దాడులు.. బెదిరింపుల‌తో తాడిప‌త్రి రాజ‌కీయం ర‌చ్చ‌కెక్కుతోంది.

తాడిపత్రిలో గోవా మద్యం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎలాగైనా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇరికించాల‌నే కుట్ర భ‌గ్న‌మైంది. టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయులు సృష్టించిన మార్ఫింగ్ ఫొటోలు సంచ‌ల‌నంగా మారాయి. అనుమానితుడి ఫొటోను మార్ఫింగ్ చేసి కేతిరెడ్డి అనుచరుడిగా ప్రచారం చేశారని వైసీపీ నేత‌లు మండిపడుతున్నారు. పెద్దారెడ్డిని కేసు ఇరికించి, లిక్క‌ర్ అక్ర‌మ రవాణాను వైసీపీకి అంట‌గ‌ట్టేందుకు ఇంత‌కు దిగ‌జారాలా..? అని ప్ర‌శ్నిస్తున్నారు.

రెండు రోజుల క్రితం తాడిపత్రి సమీపంలో పోలీసులు భారీగా గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 400 ఫుల్ బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో పుట్లూరు మండలం చింతలపల్లికి చెందిన రామాంజినేయరెడ్డి అనుమానితుడిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రామాంజినేయరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడిగా చూపించే ప్రయత్నం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రామాంజినేయరెడ్డికి సంబంధించిన ఫొటోలో మరో వ్యక్తి స్థానంలో వైసీపీ కార్యకర్త ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి సన్నిహితుడిగా చూపించేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ మార్ఫింగ్ ఫొటోల‌ను సృష్టించార‌ని మండిపడ్డారు.

అయితే అసలు ఫొటోను తాడిపత్రి వైసీపీ నేతలు బయటపెట్టడంతో మార్ఫింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో లిక్కర్ కేసులో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇరికించేందుకు టీడీపీ నేతల వర్గం కుట్ర చేసిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థిపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఫొటోలను మార్ఫింగ్ చేయడం తీవ్ర నేరమని పేర్కొన్నారు.

అసలు ఫొటో, మార్ఫింగ్ ఫొటోలను పరిశీలించి బాధ్యులను గుర్తించాలని, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గోవా మద్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment